టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఓవైపు రాజకీయ దుమారం మరోవైపు పరీక్షల నిర్వహణ, రద్దుతో లక్షలాది మంది అభ్యర్ధులలో అసహనం వలన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతుండటం సహజం. అందుకే నష్టనివారణ చర్యల గురించి చర్చించేందుకు సిఎం కేసీఆర్ శనివారం ఉదయం ప్రగతి భవన్‌లో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిలో టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితో సహా విద్యాశాఖ, పోలీస్ శాఖ, న్యాయ, ఆర్ధిక తదితర శాఖల మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
ఈ వ్యవహారంతో మసకబారిన టిఎస్‌పీఎస్సీ ప్రతిష్టను పునరుద్దరించేందుకు సమూలంగా ప్రక్షాళన చేయడం, టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్ చేత రాజీనామా చేయించడం, భవిష్యత్‌లో ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా వ్యవస్థను ఏవిదంగా పటిష్టం చేయాలి, దీనిపై ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తునందున వాటిని ఏవిదంగా ఎదుర్కోవాలి?గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుతో ఎదురయ్యే సమస్యలు, భవిష్యత్‌లో నిర్వహించబోయే పరీక్షలపై దీని ప్రభావం ఏవిదంగా ఉండబోతోంది?తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించవచ్చు. మరికొద్ది సేపటిలో సమావేశం ముగియగానే ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రులు మీడియాకు సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను తెలియజేస్తారు.