చిరంజీవి బిజెపీకి దగ్గరవుతున్నారా?

March 18, 2023


img

భారత్‌కు ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ఆస్కార్ అవార్డు సాధించిన ఆ చిత్ర బృందం భారత్‌ తిరిగి వచ్చింది. హైదరాబాద్‌ విమానాశ్రయంలో అభిమానులు వారికి ఘనస్వాగతం పలికారు. వారిలో రామ్ చరణ్‌ మాత్రం శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా నుంచి తన భార్య ఉపాసనతో కలిసి నేరుగా ఢిల్లీకి చేరుకొన్నారు. అక్కడ కూడా వారికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. 

ఇండియా కాంక్లేవ్ సదస్సులోనే రామ్ చరణ్‌, చిరంజీవి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన భారత్‌కు ఆస్కార్ అవార్డు సాధించినందుకు రామ్ చరణ్‌కు శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఆ ఫోటోలను చిరంజీవి తమ అభిమానుల కోసం ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, తన కుమారుడిని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ఆస్కార్ అవార్డ్ సాధించినందున రామ్ చరణ్‌ కేంద్ర మంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలవడం సహజమే కానీ చిరంజీవి కూడా ఢిల్లీ వచ్చి ఆయనను కలవడమే కాస్త ఆలోచింపజేస్తోంది. ప్రజారాజ్యం ప్రయోగం విఫలమైన తర్వాత చిరంజీవి మళ్ళీ సినిమాలు చేసుకొంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

కానీ గత ఏడాది ప్రధాని నరేంద్రమోడీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. అప్పుడే ఆయనను ఆకర్షించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందనే గుసగుసలు వినిపించాయి. మళ్ళీ నిన్న ఢిల్లీ వెళ్ళి కొడుకుతో కలిసి అమిత్‌ షాను కలవడంతో చిరంజీవి బిజెపిలో చేరేందుకు లేదా వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయబోతున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.         



Related Post