కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి నోరు జారారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “దురదృష్టవశాత్తు నేను పార్లమెంట్ సభ్యుడిని అయ్యాను,” అని అన్నారు. ఆయన ఇంకా ఏదో మాట్లాడబోతుంటే, పక్కనే ఉన్న సీనియర్ నేత జైరాం రమేష్, దానిలో తప్పును తెలియజేసి ఆ వాఖ్యాన్నే కాస్త మార్చి చెప్పండంటూ ఏవిదంగా చెప్పాలో కూడా ఆయనే చెప్పారు.
అప్పుడు రాహుల్ గాంధీ “బిజెపి తమ దురదృష్టం కొద్దీ నేను పార్లమెంట్ సభ్యుడిని అయ్యానని భావిస్తోంది,” అంటూ సవరించి చెప్పారు. కానీ నోరు జారితే ఆ మాట్లలు వెనక్కి తీసుకోలేము కనుక అవి కేంద్రమంత్రులు, బిజెపి నేతల చెవిలోకి వెళ్లిపోయాయి. వెంటనే వారు తమదైన శైలిలో స్పందించడం మొదలుపెట్టారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, “అవును నిజంగా దురదృష్టమే,” అంటూ రాహుల్ గాంధీపార్లమెంట్ సభ్యుడిగా ఉండటం నిజంగా దురదృష్టమే అని వ్యంగ్యంగా స్పందించారు.
బిజెపి జాతీయ కన్వీనర్‌గా అమిత్ మాల్వియా స్పందిస్తూ, “రాహుల్ గాంధీకి జైరాం రమేష్ అధికారిక నానమ్మగా వ్యవహరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి కావాలనుకొంటున్న ఓ వ్యక్తి తప్పులు లేకుండా చిన్న వాఖ్యం మాట్లాడలేకపోతున్నాడు. జైరాం రమేష్ మీరు రాహుల్ గాంధీని ఎంతగా వెనకేసుకు వచ్చినప్పటికీ తానొక అసమర్దుడునని నిరూపించుకొన్నారు తన మాటలతో,” అంటూ ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ ఏదో చెప్పబోయి నోరు జారి ఉండవచ్చు. అసలు జైరాం రమేష్ ఆయనను మరికొంత మాట్లాడనిస్తే ఆయన ఏం చెప్పదలచుకొన్నారో అర్దమై ఉండేది. కానీ మొదట్లోనే వారించడంతో రాహుల్ తప్పుగా మాట్లాడిన మాటే బిజెపికి ఆయుధంగా మారింది.
అయితే ఈ 8 ఏళ్లలో ప్రధాని నరేంద్రమోడీ బహిరంగసభలలో ప్రసంగించడమో లేదా నా మనసులో మాట (మన్ కీ భారత్) అంటూ ఆకాశవాణిలో ప్రసంగించడమో చేశారు తప్ప ఏనాడూ రాహుల్ గాంధీలాగా ధైర్యంగా మీడియా సమావేశాలు నిర్వహించలేదు. ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమాలలో పాల్గొనలేదు.
కనుక రాహుల్ గాంధీ పొరపాటున నోరు జారినప్పటికీ ప్రజలను లేదా మీడియాను ఎదుర్కోవడంతో ప్రధాని నరేంద్రమోడీ కంటే చాలా ధైర్యవంతుడే అని చెప్పవచ్చు. కనుక ఈ చిన్న టంగ్ స్లిప్ గురించి కాంగ్రెస్ పార్టీ చింతించవలసిన అవసరమే లేదు. వీలైతే దమ్ముంటే ప్రధాని నరేంద్రమోడీని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాలని రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తున్న కేంద్రమంత్రులను, బిజెపి నేతలకు సవాలు విసరవచ్చు కూడా.