ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం బిఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విచారణకు హాజరుకావలసి ఉండగా ఆరోగ్య కారణాలతో హాజరుకాలేదు. దీంతో ఈడీ ఆమెను ఈ నెల 20వ తేదీన హాజరుకావాలని ఆదేశిస్తూ మళ్ళీ మరో నోటీస్ జారీ చేసింది.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, ఇండో స్పిరిట్స్ డైరెక్టర్ రామచంద్ర అరుణ్ పిళ్ళై, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు ‘సౌత్ గ్రూప్’గా ఏర్పడి ఈ లిక్కర్ స్కామ్‌ను నడిపించారని ఈడీ, సీబీఐ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే వారిలో చాలా మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని అధికార ఆమాద్మీ పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. కనుక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే అరెస్ట్ చేసిన ఈడీ కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయడానికి వెనకాడకపోవచ్చు.
ఆమెని అరెస్ట్ చేస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో నాలుగైదు రోజుల క్రితం ఆమె ఈడీ విచారణకు హాజరైనప్పుడు పలువురు మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు. మళ్ళీ ఈరోజు విచారణ తర్వాత అరెస్ట్ చేయవచ్చనే అనుమానంతో ఇద్దరు మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి చేరుకొన్నారు. కానీ 20వ తేదీకి విచారణ వాయిదా పడటంతో బిఆర్ఎస్ పార్టీలో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీస్ పంపడంతో ఈ కేసులో తదుపరి అరెస్ట్ ఆయనే కావచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.