రాజకీయ నాయకులకు వారి సభలు, ర్యాలీలు లేదా రోడ్ షోలలో వారి పార్టీ నేతలు, కార్యకర్తలు లేదా ప్రజలు పూలమాలలు వేసి గౌరవించడం మంచి సంస్కృతే. అయితే రాన్రాను అభిమానం వెర్రితనంగా మారడంతో ఆ మంచి సంస్కృతి కాస్త గజమాలలు, క్రేన్ మాలల స్థాయికి చేరుకొందిప్పుడు.
ఒక మనిషికి మెడలో పూలహారం వేస్తే గౌరవించడం. అదే… ఆ మనిషి మోయలేనంత పూలహారం వేస్తే... వెర్రితనమే అవుతుంది. రాజకీయ నాయకులు గొప్పలకు పోయి గజమాల సంస్కృతిని ప్రవేశపెట్టారు. ఆ గజమాలను ఓ నాలుగురైదుగురు వ్యక్తులు మోసుకొస్తే రాజకీయ నాయకులు దాని మద్యలో నిలబడి ఫోటోలు దిగుతుంటారు. ఇదే వెర్రితనం, వెటకారం అనుకొంటే, ఇప్పుడు క్రేన్ మాత్రమే మోయగలిగే అతిభారీ పూలదండలను తయారుచేయించి సదరు నాయకుడు వస్తున్నప్పుడు దానిని క్రేన్‌తో పైకి ఎత్తి పట్టుకొంటే దాని మద్యలో దూరి ఫోటోలు దిగుతున్నారు. దీనిని వెర్రికాదు... పిచ్చి అనాలేమో?’పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది... తలకు రోకలి చుట్టుకొంటాను’ అంటే ఇదే అనుకోవచ్చు.
అదృష్టవశాత్తు ఇంతవరకు ఈ క్రేన్ మాలలలో ఎటువంటి ప్రమాదాలు జరుగలేదు. కానీ భారీగా జనం గుమిగూడి ఉన్నప్పుడు మద్యలో క్రేన్ నిలబెట్టడం, దాంతో మాలను పైకి లేపి నాయకుడి ఎదుటకు తీసుకువెళ్ళడం ఎంత ప్రమాదకరమో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల ఏపీలో ఓ రాజకీయనాయకుడి రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు.
తొక్కిసలాటలు జరిగే అంత జనం గుమిగూడి ఉన్నప్పుడు, వారి మద్యలో పూలదండ వేసేందుకు ఇపుడు క్రేన్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఆ దండను పైకి లేపేటప్పుడు ఆ దండ లేదా, క్రేన్ భాగాలు లేదా ఏకంగా క్రేన్ ఆ నాయకుడి మీదో లేదా చుట్టూ ఉన్న జనం మీదనో పడిపోతే?అప్పుడు తొక్కిసలాటలు కూడా జరిగితే?ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో ఎవరూ ఊహించలేరు కూడా.
కానీ ఇటువంటి ప్రమాదం ఏదో జరిగేవరకు ప్రభుత్వము, పోలీసులు, సంబందిత అధికారులు ఎవరూ పట్టించుకోరని చెప్పేందుకు, రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులకు ఈ క్రేన్ మాలలు వేస్తుండటమే నిదర్శనం. అంటే ఏదో పెద్ద ప్రమాదం జరిగి, అనేకమంది ప్రాణాలు కోల్పోతేకానీ ఎవరూ మేల్కొనరా?ఈ మాత్రం ముందుచూపులేనప్పుడు ఇంతమంది అధికారులు, పోలీసులు ఉండి ఏం ప్రయోజనం?ఇప్పటికైనా రోడ్ షోలు, ర్యాలీలలో క్రేన్‌లను వినియోగించడం, వాటితో పూలమాలలు వేయడంపై రెండు తెలుగు రాష్ట్రాలలో నిషేదం విధించడం చాలా అవసరం. లేకుంటే ఏదో రోజు భారీగా ప్రాణనష్టం తప్పదు.