బిఆర్ఎస్‌లో మహిళలకు రిజర్వేషన్లు లేవు: కల్వకుంట్ల కవిత

March 16, 2023


img

చట్ట సభలలో మహిళలకు 33% సీట్లు కేటాయించాలని కోరుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతున్న బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుదవారం ఢిల్లీలో భారత్‌ జాగృతి అధ్వర్యంలో రౌండ్ టేబిల్ సమావేశం నిర్వహించారు. దీనిలో 18 పార్టీలకు చెందిన ఎంపీలు, జర్నలిస్ట్ విద్యార్థులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఓ విద్యార్ధి “మీ బిఆర్ఎస్‌ పార్టీ రాజ్యాంగంలో మహిళలకు 33% సీట్లు కేటాయించాలనే నిబందన ఉందా?”అని సూటిగా ప్రశ్నించాడు. ఇది ఆమెకు చాలా ఇబ్బందికరమైన ప్రశ్నే కానీ ఏమాత్రం తడుముకోకుండా లేదని సమాధానం చెపుతూ, “మా పార్టీయే కాదు... దేశంలో చాలా పార్టీలలోమహిళలకు 33% సీట్లు కేటాయించాలనే నిర్ధిష్టమైన నిబందన ఏదీ లేదు. కానీ కొన్ని పార్టీలు మాత్రం దీనిని అమలుచేస్తున్నాయి. దేశంలో అన్ని పార్టీలు తప్పనిసరిగా మహిళలకు 33% సీట్లు కేటాయించాలంటే పార్లమెంటులో దీని కోసం చట్టం చేయవలసి ఉంటుంది. అందుకే మేము ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతున్నాము,” అని సమాధానం చెప్పారు. 

తన తండ్రి కేసీఆర్‌ స్థాపించిన సొంత పార్టీలో, సొంత ప్రభుత్వంలోనే మహిళలకు 33% సీట్లు, పదవులు కేటాయించనప్పుడు, ఈ బిల్లు కోసం కల్వకుంట్ల కవిత పోరాడటం విడ్డూరంగా అనిపిస్తుంది. గత 8 ఏళ్ళుగా ఈ విషయం గురించి ఏనాడూ మాట్లాడని కల్వకుంట్ల కవిత, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ విచారణకు పిలుపు వచ్చినప్పటి నుంచే పోరాటాలు మొదలుపెట్టడంతో, తెలంగాణ ప్రజల... ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళల సానుభూతి, మద్దతు సంపాదించుకోవడానికే అనిపించకమానదు. 

ఒకవేళ ఈ కేసులో ఆమె అరెస్ట్ అయినా లేదా కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత కూడా ఈ బిల్లు కోసం ఆమె పోరాటం కొనసాగించిన్నట్లయితే చిత్తశుద్ధి ఉందని భావించవచ్చు. కానీ అంతకంటే ముందుగా తన తండ్రి కేసీఆర్‌ని ఒప్పించి బిఆర్ఎస్‌ పార్టీలో మహిళలకు 33% సీట్లు, ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇప్పించగలిగితే ఆమె పోరాటాలను మహిళలు నమ్ముతారు. 


Related Post