విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగం? కల్వకుంట్ల కవిత

March 16, 2023


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో నేడు మరోమారు విచారణకు హాజరుకాబోతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కేసులో తన విచారణని నిలిపివేయాలని ఈడీని ఆదేశించాలని కోరుతూ బుదవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిలో ఆమె ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేకపోయినా విచారణ పేరుతో ఈడీ తనను వేధిస్తోందని ఆరోపించారు. నిబందనల ప్రకారం మహిళనైన తనను తన నివాసంలోనే ప్రశ్నించాల్సి ఉండగా, ఈడీ కార్యాలయంలో రాత్రి 8.30 గంటల వరకు ఒంటరిగా విచారించారని కల్వకుంట్ల కవిత పిటిషన్‌ ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు.  

ఈ నెల 11న మొదటిసారి తాను విచారణకు హాజరైనపుడు ఈడీ అధికారులు తన మొబైల్ ఫోన్‌ స్వాధీనం చేసుకొన్నారని, కానీ రిపోర్టులో తానే స్వచ్ఛందంగా ఫోన్‌ను వారికి అప్పగించానని పేర్కొన్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. విచారణ పేరుతో ఈడీ అధికారులు సాక్షులపై థర్డ్ డిగ్రీ (చిత్ర హింసలు పెట్టడం) ప్రయోగిస్తున్నారని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ చేశారు. ఈ చందన్ రెడ్డి అనే వ్యక్తిని విచారణ సమయంలో ఈడీ అధికారులు కొట్టడం వలన అతను వినికిడి శక్తిని కోల్పోయారు. కనుక ఈడీ అధికారులు తనపై కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించవచ్చని భావిస్తున్నానని కనుక విచారణ సమయంలో తనతో పాటు న్యాయవాదిని కూడా తీసుకువెళ్ళేందుకు అనుమతించాలని కల్వకుంట్ల కవిత కోరారు. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని ఈడీని ఆదేశించవలసిందిగా కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు.      

విచారణ సమయంలో ఈడీ అధికారులు నిందితులు, సాక్షులతో దురుసుగా వ్యవహరిస్తున్నారని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ బలవంతంగా నేరం అంగీకరింపజేస్తున్నారని కల్వకుంట్ల కవిత చాలా తీవ్రమైన ఆరోపణలే చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్ ఆమె పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టడానికి అంగీకరించలేదు. ఈ కేసును మార్చి 24వ తేదీన విచారిస్తామని చెప్పారు. కనుక ఆమె అభ్యంతరాలను, ఆరోపణలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం అవుతోంది. 

ఈడీ విచారణలో జోక్యం చేసుకొనేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినందున కల్వకుంట్ల కవిత గురువారం ఉదయం మళ్ళీ ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకాబోతున్నారు.


Related Post