పటిమీడి జగన్ అనే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ట్విట్టర్‌లో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఏ-2 నిందితుడు రాజశేఖర్ రెడ్డి బిజెపి కార్యకర్త అని, అతను బిజెపి కోసం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడని అతని ఫోటోలతో సహా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అతను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఇద్దరికీ అత్యంత సన్నిహితుడని, కాదని బిజెపి చెప్పగలదా అని ట్విట్టర్‌లో ప్రశ్నించాడు.
తమ పార్టీ కార్యకర్త చేసిన ఈ ట్వీట్‌పై తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, “తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు బిజెపి ఇంత నీచానికి దిగజారిపోయింది. టిఎస్‌పీఎస్సీలో తమ పార్టీ కార్యకర్త రాజశేఖర్ ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీకి కుట్ర చేసి నిరుద్యోగయువత జీవితాలతో చలగాటం ఆడింది. కనుక ఈ కోణంలో నుంచి కూడా లోతుగా దర్యాప్తు జరిపి ఈ కుట్రను చేధించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని తెలంగాణ డిజిపిగారికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అంటూ రీట్వీట్ చేశారు.
ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి వలన తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నీరుగార్చేందుకే సిట్‌కి ఈ దర్యాప్తు బాధ్యత అప్పగించిందని బండి సంజయ్ ఆరోపించారు. కానీ ఇప్పుడు మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బిజెపియే ఈ కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఒకవేళ ఈ వ్యవహారంలో బిజెపి ప్రమేయం ఉన్నట్లు తేలితే ఆ పార్టీ నేతలకు ఇబ్బందులు తప్పవు.