ఆరోజు ఆర్ఆర్ఆర్‌ని నామినేట్ చేసి ఉండి ఉంటే...

March 14, 2023


img

ఆర్ఆర్ఆర్‌ సినిమా భారత్‌లో రిలీజ్‌ అయిన తర్వాత అన్ని రాష్ట్రాలలో విదేశాలలో సైతం మంచి ఆదరణ, ప్రశంశలు లభించాయి. కనుక భారత్‌ తరపున ఆస్కార్ అవార్డుల కోసం ఆర్ఆర్ఆర్‌ సినిమాని తప్పక పంపిస్తారనుకొంటే, భారత్‌ ఆస్కార్ నామినేషన్స్ కమిటీ ఆర్ఆర్ఆర్‌ సినిమాను పక్కన పెట్టి ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాల మెప్పుకోసం ‘చల్లో షో’ అనే గుజరాతీ సినిమాని పంపింది. అయితే ఆ సినిమా ఆస్కార్ పోటీలో నిలువలేకపోయింది కానీ ఆర్ఆర్ఆర్‌ ఆస్కార్ అవార్డు గెలుచుకొంది. 

ఆర్ఆర్ఆర్‌ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో నేడు పార్లమెంటు ఉభయసభలు రాజమౌళి బృందాన్ని అభినందించాయి. అంతకు ముందు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు కూడా ఆర్ఆర్ఆర్‌ బృందాన్ని అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. 

భారత్‌లో ఒక క్రీడాకారుడు లేదా ఓ శాస్త్రవేత్త లేదా ఓ కళాకారుడు దేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు వారిని ఎవరూ గుర్తించరు. తోడ్పాటు అందించరు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సైతం వారిని గుర్తించి తోడ్పాటు అందించకపోగా తిరస్కరిస్తుంటాయి... అవమానిస్తుంటాయి కూడా. ఇందుకు ఆర్ఆర్ఆర్‌ సినిమాయే ఓ నిదర్శనం. 

అయితే యావత్ ప్రపంచం వారి ప్రతిభను గుర్తించిన తర్వాత సదరు వ్యక్తిని లేదా బృందాన్ని సొంతం చేసుకొనేందుకు అందరూ పోటీలు పడుతుంటారు. ఎంతో అవసరం ఉన్నప్పుడు మొహం చాటేసిన ప్రభుత్వాలే అవసరం లేని ఇటువంటి సమయంలో వారికి కోట్ల పాయలు నజరానాలు, అవార్డులు ప్రకటిస్తుంటాయి. ఆర్ఆర్ఆర్‌ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. 

రాజమౌళి, కీరవాణి మా రాష్ట్రం వారంటే, చంద్రబోస్, సిప్లీ గంజ్ మా రాష్ట్రం వారని మరొకరు సొంతం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి బృందం అమెరికా నుంచి ఎప్పుడు భారత్‌ చేరుకొంటుందా... వారిని సన్మానిస్తూ ఎప్పుడు ఫోటోలు దిగి క్రెడిట్ సొంతం చేసుకొందామా అని ఎదురుచూస్తున్నాయి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు.  

అదే... ఆనాడు ఆర్ఆర్ఆర్‌ సినిమాని భారత్‌ తరపున ఆస్కార్ కమిటీకి పంపించి ఉండి ఉంటే నేడు కేంద్ర ప్రభుత్వం ఆ విషయం గొప్పగా చెప్పుకోగలిగి ఉండేది కదా?కానీ అప్పుడు తిరస్కరించి ఇప్పుడు చప్పట్లు కొట్టి సన్మానించాలనుకొంటోంది. భారత్‌లో ఎప్పుడూ ఇలాగే జరుగుతుంటుంది. కనుక చప్పట్లు కొడుతున్నవారి కోసం మనమూ చప్పట్లు కొట్టాల్సిందే.

 



Related Post