ఆ గొడవ గురించి నేను మాట్లాడను కానీ...

March 13, 2023


img

తెలంగాణ బిజెపిలో కుమ్ములాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశ్యించి నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌, మరో సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్ రావు చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీలో దుమారం సృష్టిస్తున్నాయి. బండి పెద్ద ‘తోపు’ కాదని పార్టీలో అందరినీ కలుపుకుపోవలసిన వ్యక్తి మాత్రమే అని ధర్మపురి అరవింద్‌ అనగా, బండి సంజయ్‌ ఓ పరిణతిలేని మాటలు మాట్లాడుతున్నాడని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రశేఖర్ హితవు పలికారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుపై వీరిద్దరూ చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి అధిష్టానం స్పందించేలోగా, పార్టీలో ఒకరొకరు తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతుండటంతో తెలంగాణ బిజెపిలో నేతల మద్య కుమ్ములాటల గురించి అందరికీ తెలిసిపోతోంది. 

సీనియర్ మహిళా నేత విజయశాంతి ఈ గొడవ గురించి స్పందిస్తూ, “ధర్మపురి అర్వింద్ గారి ప్రకటనపై నన్ను మీడియా వారు అడుగుతున్న ప్రశ్నకు సమాధానంగా... “బీజేపీ నేత ఎవరైనా...పార్టీ కార్యకర్త, నేత లేదా అధ్యక్షుల కామెంట్స్ పై స్పందించినా... మాట్లాడినా... నేను పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రమే నా అభిప్రాయం చెప్పగలను." మా పార్టీ ఎంపీ అర్వింద్ గారు మాట్లాడిన సందర్భం మొత్తం నేను చూడలేదు కానీ, అందులోని ఏదో ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న బీఆరెస్ అనుకూల మీడియాకు మాత్రం ఒక్కటే ఈ సందర్భంగా చెప్పగలను. 

@bandisanjay_bjp గారు తన మాటలు వెనక్కి తీసుకోవాల్సి వస్తే... కేసీఆర్ గారు, వారి కుటుంబం, చాలామంది బీఆరెస్ నాయకులు వారి గత, ఇప్పటి మాటలను అనేకసార్లు వెనక్కి తీసుకుని, వందల సార్లు ముక్కు నేలకు రాయాల్సి వస్తుందని కూడా ఆ మీడియా గుర్తించాలి,” అని ట్వీట్‌ చేశారు. అంటే తాను బండి సంజయ్‌కి మద్దతు ఇస్తున్నట్లు విజయశాంతి చెప్పకనే చెప్పారని అర్దం అవుతోంది.


Related Post