నేడు ఢిల్లీలో షర్మిల దీక్ష... సీబీఐ దర్యాప్తు చేయాలట!

March 14, 2023


img

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఢిల్లీలో జంతర్ మంతర్  వద్ద ధర్నా చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని దానిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ ఆమె ఈ ధర్నా చేస్తున్నారు. ఇదివరకు ఓ సారి ఆమె ఢిల్లీకి వెళ్ళి నేరుగా సీబీఐని కలిసి దర్యాప్తు చేయాలని కోరారు. కానీ సీబీఐ స్పందించకపోవడంతో ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. ధర్నా అనంతరం ఆమె పార్టీ నేతలతో కలిసి పార్లమెంట్ వరకు ర్యాలీ కూడా నిర్వహించాలనుకొంటున్నారు. 

తెలంగాణ రాజకీయాలు ఎంతసేపూ బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి తప్ప ఆమె పార్టీ పేరే వినిపించడం లేదు. ఆమె తెలంగాణలో పాదయాత్ర పూర్తిచేసినప్పటికీ తగిన గుర్తింపు, ప్రజాధారణ లభించడం లేదు. పాదయాత్ర మద్యలో వరంగల్‌లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల విమర్శలు, ఆమె కారుపై దాడి, ఆ తర్వాత హైదరాబాద్‌లో పోలీసులు ఆమెను కారుతో పోలీస్ స్టేషన్‌కు తరలించడం వంటి సందర్భాలలో అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. కనుక అందరి దృష్టిని ఆకర్షించేందుకే ఆమె నేడు ఢిల్లీలో ఈ పేరుతో హడావుడి చేస్తున్నారేమో?

ఒకవేళ ఆమె వద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబందించి ఏమైనా ఆధారాలు ఉన్నట్లయితే, ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసి వాటిని కోర్టుకు సమర్పించి సీబీఐ దర్యాప్తు కోరవచ్చు. కానీ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే తాను ఈ ఆరోపణలు చేస్తున్నట్లు ఆమే స్వయంగా ఇదివరకు ఓసారి అంగీకరించారు. తన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేనందునే ఆమె హైకోర్టుకి వెళ్ళడం లేదు. కానీ ఢిల్లీలో ధర్నా చేయడానికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు.... ఓ సాకు ఉంటే చాలు. కనుక ధర్నా చేస్తున్నారనుకోవాలి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో మీడియా దృష్టిని ఆకర్షించేందుకు వివిద రాష్ట్రాల నుంచి ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీ వచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తుంటాయి. వైఎస్ షర్మిల కూడా అందుకే ధర్నా చేస్తున్నారనుకోవలసి ఉంటుంది.


Related Post