బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి చేర్చిన దర్శకుడు రాజమౌళి, తన తర్వాత సినిమా ఆర్ఆర్ఆర్‌తో ఏకంగా ఆస్కార్ అవార్డ్ సాధించిపెట్టి భారతీయ సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్ళారు. ఆ సినిమాలో నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డ్ లభించినందుకు భారతీయులందరూ సంతోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ ఆస్కార్ వేదికపై తెలుగు పాట వినిపింపజెసి అవార్డు సాధించినందుకు చాలా సంతోషిస్తున్నారు. ఆ పాట రచయిత చంద్రబోస్, దానిని స్వరపరిచిన కీరవాణి ఆస్కార్ వేదికపై ఈ అవార్డులను అందుకొన్నప్పుడు రాజమౌళితో సహా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం అంతా ఆనందంతో ఎంతో ఉప్పొంగి పోయింది.
ఆస్కార్ వేదికపై ఇద్దరు తెలుగు వ్యక్తులు, ఓ తెలుగు సినిమా, ఓ తెలుగు పాట అన్నీ మహదానందం కలిగించేవే. అయితే అసలు నాటునాటు పాటకు గుర్తింపు తెచ్చింది ప్రేమ్ రక్షిత్ కూర్చిన అత్యద్భుతమైన కొరియోగ్రఫీ, దానిని అంతా గొప్పగాను చేసి చూపించిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ అనే దానిలో బహుశః ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ డ్యాన్స్ స్టెప్స్ లకే అందరూ ఫిదా అయిపోయారు.
ఒకవేళ ఆ పాట కొరియోగ్రఫీ, వారి డ్యాన్స్ అంత అద్భుతంగా లేకపోయుంటే, ఆ పాట విని ఇతర రాష్ట్రాలవారు, విదేశీయులు ఆకర్షితులయ్యేవారా?అంటే చెప్పలేము. కానీ ఆ పాటకు వారిద్దరూ పోటాపోటీగా చేసిన ఆ డ్యాన్స్ చూస్తే ఎంతటివారైనా ఫిదా అయిపోవలసిందే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే పాట కంటే డ్యాన్స్ అందరినీ ఎక్కువగా ఆకట్టుకొందని అర్దం అవుతోంది. అందుకే నాటు నాటు అనగానే పాట పాడేందుకు ప్రయత్నించే బదులు అందరూ ఆ డ్యాన్స్ చేసి చూపిస్తున్నారు.
కనుక ఆస్కార్ కమిటీ కొరియోగ్రఫీకి, అవకాశం ఉంటే జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా అవార్డు ఇచ్చి ఉంటే ఈ అవార్డు పరిపూర్ణంగా ఉండేది. కానీ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు ఆస్కార్ అవార్డు ఇచ్చి ఉన్నా ఆ పాటకి పూర్తికి న్యాయం చేసిన్నట్లు ఉండేది. కానీ ఆస్కార్ అవార్డులకు పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది కనుక దురదృష్టవశాత్తు మరో మూడు అవార్డులు మన చేజారిపోయాయని సర్దుకుపోక తప్పదు.