బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు బిజెపి ప్రతినిధులను సిఎం కేసీఆర్ చాలా తెలివిగా వలవేసి పట్టుకొని జైలుకి పంపించారు. ఆ వ్యవహారాన్ని మునుగోడు ఉపఎన్నికలలో ప్రచారం చేసుకొని పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొన్నారు. ఆ కేసు విచారణ పేరుతో ఢిల్లీలోని పెద్దలని కూడా వల వేసి బందిద్దామనుకొన్నారు. ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు చేసిన సంగతి అందరికీ తెలుసు.
కానీ అత్యుత్సాహంతో చేసిన ఓ చిన్న పొరపాటు మొత్తం కధంతటినీ మార్చేసింది. బిజెపి ప్రతిధులను లోపల వేయగానే, సిఎం కేసీఆర్ అత్యుత్సాహంతో ప్రెస్‌మీట్ పెట్టి పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో కనుగొన్న విషయాలను చెప్పడం, ఆ ఫోటోలు వీడియోలను మీడియాకి విడుదల చేయడం, ఆ వివరాలన్నిటినీ సుప్రీంకోర్టుతో సహా దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు పంపారు. తద్వారా కేంద్రం మీద రాజకీయంగా పైచేయి సాధించానని కేసీఆర్ అనుకొన్నారు. కానీ అదే పెద్ద పొరపాటని తర్వాత హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులతో స్పష్టమైంది.
ఆ ప్రెస్‌మీట్ గురించే ప్రస్తావిస్తూ ముగ్గురు బిజెపి ప్రతినిధులు హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసులో తమని ఇరికించారని, ఆయన కనుసన్నలలో పనిచేసే ‘సిట్’ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయదని రుజువైంది కనుక ఈ కేసు దర్యాప్తుని సీబీఐకి బదిలీ చేయాల్సిందిగా కోరారు.
వారి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఆ కేసు దర్యాప్తుని సీబీఐకి బదిలీ చేయడం కాక, అంతవరకు సిట్ చేసిన దర్యాప్తుని రద్దు చేస్తూ తీర్పు చెప్పారు. హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనానికి, సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఎదురుదెబ్బలే తగిలాయి. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దర్యాప్తు సీబీఐ చేతికి మారడంతో, ఇదివరకు హీరోలుగా చెప్పుకోబడ్డ నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బాధితులుగా మారడం విశేషం.
బిజెపిని వల వేసి పట్టుకొందామని ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విచారణ పేరుతో తమ ఎమ్మెల్యేలని సీబీఐ వేధించకుండా కాపాడుకొనేందుకు కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వస్తోంది. ఈ కేసుపై సుప్రీంకోర్టుని ఆశ్రయించగా. వేసవి సెలవుల తర్వాత మళ్ళీ కోర్టు పునః ప్రారంభం అయిన తర్వాత అంటే జూలై 31 తర్వాత ఈ కేసు విచారణ చేపడతామని, అప్పటి వరకు ఈ కేసు విచారణపై సీబీఐని యధాతధస్థితిని కొనసాగించవలసిందిగా ఆదేశించింది. కనుక అప్పటి వరకు నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊరట లభించిన్నట్లే కనుక అందుకే సంతోషపడక తప్పదు. కానీ సీబీఐ కత్తి వారి నెత్తిపై వ్రేలాడుతూనే ఉంటుంది.