భారతీయ చిత్ర పరిశ్రమకి, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు నేడు సుదినం. రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ లభించింది.
భారతీయ కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం 5.30 గంటల నుంచి లాస్ ఏంజలీస్ నగరంలోని డల్బీ థియేటర్‌లో అట్టహాసంగా ఈ 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ సినిమాలోని ‘లిఫ్ట్ మీ అప్’, ఎవ్రీథింగ్ ఎవ్రీవర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలని ‘దిస్ ఈజ్ లైఫ్’, టెల్ ఇట్ లైక్ ఏ వుమన్ సినిమాలోని అప్లాజ్, టాప్ గన్ మావారిక్ సినిమాలోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలతో పోటీ పడి వాట్టనిటినీ వెనక్కు తోసేసి మన తెలుగు ‘నాటు పాట’ ఆస్కార్ అవార్డ్ గెల్చుకొంది.
నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకి ఎంపికైందని చెప్పగానే ఆడిటోరియం కరతాళధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఈ చిన్న ప్రకటన కోసమే ఊపిరిబిగప్పట్టి ఎదురుచూస్తున్న రాజమౌళి దంపతులు కుర్చీలలో నుంచి నిలబడి చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ తదితరులు ఆనందంతో పొంగిపోతున్నారు.
ఈ పాటని రచించిన చంద్రబోస్, స్వరపరిచిన ఎంఎం కీరవాణి వేదికపైకి వెళ్ళి ఆస్కార్ అవార్డులు అందుకొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఈ పాట పాడిన రాహుల్ సిప్లీ గంజ్, కాల భైరవ కలిసి ఆస్కార్ వేదికపై ఈ పాట లైవ్ పెర్ఫార్మేన్స్ ఇస్తున్నప్పుడు ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, తమిళ్, కన్నడం, మలయాళ, హిందీ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఇంకా అనేకమంది ప్రముఖులు ఆర్ఆర్ఆర్ బృందానికి సోషల్ మీడియాలో అభినందలు తెలియజేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాను కేంద్ర ప్రభుత్వం ఆస్కార్‌కు నామినేషన్స్ కోసం పంపించనప్పటికీ, ఆర్ఆర్ఆర్ బృందం ధైర్యం చేసి ఆస్కార్ నామినేషన్స్ కొరకు దరఖాస్తు చేసుకొనకపోయి ఉంటే ఈ అవార్డు చేజారిపోయి ఉండేదే! తెలుగు సినిమాకి జాతీయఅవార్డు లభించడమే చాలా కష్టంగా ఉన్న తరుణంలో ఏకంగా ఆస్కార్ అవార్డ్ అందుకోవడం అందరికీ గర్వకారణం.