రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ చూడబోతున్నారా... కాస్త ఆగండి!

March 11, 2023


img

వెంకటేష్, రానా కలిసి చేసిన తొలి వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు నిన్న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అదేదో ఫ్యామిలీ డ్రామా... యాక్షన్ సిరీస్‌ అనుకొని టీవీల ముందు కూర్చోన్న తెలుగు ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు. దీనిలో మొదటి నుంచే బోలెడన్ని బూతులు, విచ్చలవిడిగా సెక్స్ సన్నివేశాలు ఉన్నాయి. 

అనేక ఓటీటీలు వాటిలో సెన్సార్ అవసరంలేని వెబ్‌ సిరీస్‌లు మొదలైన తర్వాత బూతులు, విచ్చలవిడిగా సెక్స్ సన్నివేశాలు, ఒళ్ళు గగుర్పొడిచే హింస, రక్తపాతంతో నింపేస్తున్నారు. అయితే ఓటీటీలో కొన్ని అత్యద్భుతమైన వెబ్‌ సిరీస్‌ కూడా వస్తున్నాయి. వెంకటేష్, రానాలకున్న మంచి ఇమేజ్‌ కారణంగా ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ కూడా ఆవిదంగా అత్యున్నత ప్రమాణాలతో ఉంటుందని భావిస్తే, ప్రతీ ఎపిసోడ్‌లో కనీసం రెండు మూడు విచ్చలవిడి సెక్స్ సన్నివేశాలు, లెక్కలేనన్ని బూతులతో నింపేశారు. 

ఈ వెబ్‌ సిరీస్‌ను సకుటుంబంగా చూడవద్దని, ఎవరికి వారు వేర్వేరుగా చూడాలని రానా ముందే చెప్పాడు. అది నిజమే అని రానా నాయుడు నిరూపించింది. ముఖ్యంగా ఫ్యామిలీ హీరో అని మంచి పేరున్న వెంకటేష్, సినీ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం నుంచి వచ్చిన రానాల నుంచి ఇటువంటి బి-గ్రేడ్ వెబ్‌ సిరీస్‌ ఎవరూ ఆశించలేరు. 

ఈ వెబ్‌ సిరీస్‌లో అసలు కధ ఏమిటి? అనే చర్చ కంటే ఈ బూతులు, సెక్స్ సన్నివేశాల గురించే విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారంటే ఇది ఎంత చవుకబారుగా ఉందో అర్దం చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌లలో ఈ స్థాయి సెక్స్ డోసు ఉంటోంది కనుక తెలుగు ప్రేక్షకుల కోసం వారికి అర్దమయ్యే భాషలో పచ్చిబూతులతో తీస్తే ఇంకా గొప్పగా ఉంటుందని భావించి దీనిని తీసిన్నట్లున్నారు తప్ప దీంతో ఏదో ఓ గొప్ప కధని చెప్పాలని కాదనిపిస్తుంది. 

ఇంకా దారుణం ఏమిటంటే వెంకటేష్, రానాలతో సహా ఈ వెబ్‌ సిరీస్‌లో నటించిన ప్రతీ ఒక్కరూ బూతులు మాట్లాడుతూ, సెక్స్ సన్నివేశాలలో నటించడం. కనుక రానా నాయుడు గురించి ఇంకా చెప్పుకోవడం వృధాయే. చివరిగా ఒకమాట... ఎవరు ఇంట్లో తల్లితండ్రులతో, పిల్లలతో, అక్కచెల్లెళ్ళతో కలిసి ఈ రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ చూసే ప్రయత్నం చేయవద్దు.


Related Post