కవితకోసం బిఆర్ఎస్ దండు... నవ్య కోసం నోరెత్తరేమి?

March 11, 2023


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈరోజు ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరవుతుండటంతో మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావుతో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకొని ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. అయితే బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ తనను వేధిస్తున్నాడంటూ జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్‌ భోగ శ్రావణి మీడియా సమావేశంలో కన్నీళ్ళు పెట్టుకొని చెప్పినా, ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నా బిఆర్ఎస్ పెద్దలు పట్టించుకోలేదు!

తాజాగా స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య తనను లైగికంగా వేధిస్తున్నాడంటూ బిఆర్ఎస్‌కే చెందిన జానకీపురం మహిళా సర్పంచ్‌ నవ్య మీడియా ముందుకు వచ్చి చెప్పుకొంటున్నా బిఆర్ఎస్‌ పెద్దలు ఎవరూ పట్టించుకోవడం లేదు! 

ఢిల్లీలో మహిళల హక్కుల (మహిళా రిజర్వేషన్ బిల్లు) కోసం శుక్రవారం దీక్ష చేసిన కల్వకుంట్ల కవితకు సంఘీభావంగా దీక్షలో పాల్గొన్న మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా పార్టీలోనే సాటి మహిళ ఎదుర్కొంటున్న ఈ వేధింపులపై నోరు విప్పడం లేదు! 

సిఎం కేసీఆర్‌తో సహా పార్టీలో అందరూ కల్వకుంట్ల కవితకు జరుగుతున్న అన్యాయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఇరుకొన్న కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసు పంపినా, విచారణ జరిపినా అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని వాదిస్తున్నారు. కల్వకుంట్ల కవితకు అన్యాయం జరిగితే రాష్ట్రంలో మహిళలందరికీ అన్యాయం జరిగిన్నట్లే అని తీర్మానిస్తున్నారు. కానీ పార్టీలో ఎమ్మెల్యేల వేధింపులకు గురవుతున్న ఈ మహిళల గురించి ఎవరూ మాట్లాడటం లేదు?అంటే రాష్ట్రంలో, బిఆర్ఎస్‌ పార్టీలో కేవలం కల్వకుంట్ల కవిత ఒక్కరే మహిళా? మిగిలిన మహిళలు మహిళలు కారా?వారికి జరిగే అన్యాయం, ఈ వేధింపులు పెద్దగా పట్టించుకోవలసిన విషయాలు కావా?అనే సందేహం కలుగుతుంది. 

గతంలో తాటికొండ రాజయ్య అవినీతికి పాల్పడినందునే సిఎం కేసీఆర్‌ ఆయనను మంత్రివర్గంలో నుంచి తొలగించారు. కానీ అతను తనను లైంగికంగా వేదిస్తున్నాడని పార్టీలో ఓ వివాహిత మహిళా మీడియా ముందుకు వచ్చి చెప్పుకొంటున్నా సిఎం కేసీఆర్‌ ఉపేక్షిస్తుండటం ద్వారా తన వెనుక కేసీఆర్‌ ఉన్నారని రాజయ్య చెప్పుకొంటున్న మాటలు నిజమే అని భావించాల్సి ఉంటుంది.        

బహుశః అందుకే ఎవరూ నవ్యకు మద్దతుగా మాట్లాడటం లేదేమో?మాట్లాడితే వారిపై పార్టీ వ్యతిరేకి ముద్ర పడవచ్చు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న నవ్యపై కూడా రేపు అదే ముద్రవేసి చేతులు దులుపుకొన్నా ఆశ్చర్యం లేదు.


Related Post