ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. విచారణ తర్వాత ఆమెని అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో సిఎం కేసీఆర్ అత్యవసరంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటి దర్యాప్తు సంస్థలను మనమీదకి ఉసిగొల్పి మన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను వేధించింది. ఇప్పుడు నా బిడ్డ దగ్గరకొచ్చారు. మహా అయితే ఏం చేస్తారు? నా బిడ్డను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు.. అంతే గదా?ఏం చేస్తారో చూద్దాం. ఇటువంటి అక్రమ కేసులు, విచారణ పేరుతో వేధింపులు, అరెస్టులకు భయపడేదేలేదు. కేంద్ర ప్రభుత్వంతో పోరాటం ఆపేదే లేదు. కేంద్రంలో బిజెపిని గద్దె దించేవారకు పోరాడుదాం. 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండబోదు,” అని అన్నారు.
సిఎం కేసీఆర్ తన కుమార్తె కవితను ఈడీ అరెస్టు చేసినా వెనక్కు తగ్గబోనని చెప్పడం పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకేనని భావించవచ్చు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితనే ఈడీ అరెస్ట్ చేయగలిగినప్పుడు, ఇక తమ పరిస్థితి ఏమిటని ఈడీ, సీబీఐ, ఐటి దాడులను ఎదుర్కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భయాందోళనలు చెందడం సహజం. కనుక వారికి ధైర్యం చెప్పడానికే సిఎం కేసీఆర్ అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటుచేసిన్నట్లు భావించవచ్చు. “మీరైనా... నా బిడ్డ అయినా అందరూ ఒక్కటే... కనుక భయపడకుండా అందరం కలిసికట్టుగా పొరాడి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాము,” అని సిఎం కేసీఆర్ వారికి భరోసా ఇస్తున్నట్లు భావించవచ్చు.
వచ్చే ఎన్నికలలో ఎలాగైనా బిఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణలో అధికారంలోకి రావాలని రాష్ట్ర బిజెపి నేతలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక బిఆర్ఎస్ నేతలు ఈ ఒత్తిడిలో ఉన్నప్పుడే లొంగదీసుకొని బిజెపిలో చేర్చుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. కనుక బిజెపి వలన పార్టీ బలహీనపడకుండా కాపాడుకోవడం కూడా చాలా అవసరమే. కేసీఆర్ అత్యవసరంగా బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడానికి ఇదీ ఓ కారణమై ఉండవచ్చు. కానీ ఓ వైపు పార్టీ చెదిరిపోకుండా కాపుకాసుకొంటూ, శాసనసభ ఎన్నికలలో మళ్ళీ పార్టీని గెలిపించుకొంటూ, జాతీయస్థాయిలో మోడీ ప్రభుత్వంతో పోరాడటం చాలా కష్టమే. కనుక కేసీఆర్ మళ్ళీ తన రాజకీయ విశ్వరూపం చూపక తప్పదు.