బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నుంచి నోటీసు అందుకొని రేపు ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకాబోతున్న సమయంలో ఈరోజు ఓ అనూహ్యమైన పరిణామం జరిగింది.
ఈ కేసులో ప్రధాన సూత్రధారులలో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర అరుణ్ పిళ్ళై ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తరపు న్యాయవాది శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. దానిలో రామచంద్ర అరుణ్ పిళ్ళై ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకొనేందుకు అనుమతి కోరారు.
ఇండో స్పిరిట్స్ కంపెనీలో తాను కల్వకుంట్ల కవితకు బినామీ భాగస్వామినని ఆయన ఇదివరకు ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. దాని ఆధారంగానే ఈడీ కల్వకుంట్ల కవితకి నోటీస్ పంపించి విచారణకు సిద్దమైంది. కానీ రామచంద్ర అరుణ్ పిళ్ళై ఇప్పుడు తన ఆ వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలనుకొంటూ పిటిషన్ వేశారు. కనుక దీనిపై ఈడీ, న్యాయస్థానం ఏవిదంగా స్పందిస్తాయో చూడాలి.
ఒకవేళ న్యాయస్థానం ఆయన వాదనలతో ఏకీభవిస్తే, కల్వకుంట్ల కవితని విచారించడానికి ఈడీ ఇబ్బంది కావచ్చు. ఒకవేళ న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను తిరస్కరిస్తే అది కూడా కల్వకుంట్ల కవితకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ప్రమేయం ఉందని నమ్ముతున్నట్లు భావించవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఇప్పటికే ఈడీ నోటీస్ పంపింది కనుక రేపు కల్వకుంట్ల కవిత విచారణకు హాజరుకావడం ఖాయమనే భావించవచ్చు.