ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కనపెట్టేయడంతో తీవ్ర అసంతృప్తి చెంది సిఎం కేసీఆర్‌ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. టిఆర్ఎస్ పేరుతో సొంతంగా కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ వైఖరిలో ఈ మార్పు కారణంగా కేసీఆర్ తన కంపెనీకి కాంట్రాక్టులు దక్కకుండా చేసినా ఆశ్చర్యం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. కానీ ఆయన కంపెనీకే రూ.301.45 కోట్లు విలువగల కాంట్రాక్ట్ లభించనుంది.
ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో రూ.301.45 కోట్లు విలువగల 13 పనులకు (ప్యాకేజీలు) జలవనరుల శాఖ టెండర్లు పిలువగా వాటిలో ఆయనకు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ కూడా బిడ్ వేసింది. ఆ శాఖ అధికారులు గురువారం ప్రైసింగ్ బిడ్స్ తెరిచారు. వాటిలో పొంగులేటి కంపెనీ అంచనా విలువ కంటే 0.99% తక్కువకి కోట్ చేయగా మిగిలిన రెండు కంపెనీలు 4.95%, 4.50% అధికంగా కోట్ చేశాయి. కనుక నిబందనల ప్రకారం అందరి కంటే తక్కువ కోట్ చేసిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకే ఈ భారీ కాంట్రాక్ట్ లభించనుంది.
అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ సిఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ ఆయన కంపెనీకు ఇస్తుందా లేదా సాంకేతిక కారణాలు చూపి పాత టెండర్లను రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లను పిలుస్తుందో చూడాలి.