త్వరలో రెండో విడత దళిత బంధు... 1.30 లక్షల మందికి!

March 09, 2023


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న దళితబంధు పధకంలో మొదటి విడత పూర్తవడంతో ఆగస్ట్ 16వ తేదీ నుంచి రెండో విడత ప్రారంభించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. రెండో విడతలో రాష్ట్రంలో 1.30 లక్షల మందికి ఈ పధకం ద్వారా ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 118 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి చొప్పున మొత్తం 1.30 లక్షల దళితకుటుంబాలకు ఈ పధకం అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మొదటివిడతలో జిల్లా కలెక్టర్ల ద్వారా దళిత బంధు నిధులు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈసారి కూడా అదే పద్దతిలో నిధులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పధకంలో ఒక్కో దళిత కుటుంబానికి తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా రూ.10 లక్షలు చొప్పున ప్రభుత్వం ఆర్ధికసాయం అందిస్తోంది. దాంతో వారు తమకి అవగాహన ఉన్న లేదా కోరుకొన్న వ్యాపారం, వృత్తి ప్రారంభించుకోవచ్చు. 

తెలంగాణ రాష్ట్రంలో ఈ పధకం విజయవంతంగా అమలవుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చి దీని గురించి అడిగితెలుసుకొని వెళుతున్నారని, వేరే పేరుతో తమ రాష్ట్రాలలో కూడా ఈ పధకాన్ని అమలుచేయాలనుకొంటున్నారని ఆర్ధికమంత్రి హరీష్‌ రావు తెలిపారు. 

ఈరోజు మంత్రివర్గ సమావేశంలో తీసుకొన్న మరికొన్ని కీలక నిర్ణయాలు: 

• కొత్తగా గృహాలక్ష్మి పధకం ప్రారంభం. దీని కింద సొంత స్థలం ఉన్న పేదలకు ప్రభుత్వం ఒక్కో వాయిదాలో లక్ష చొప్పున మూడు వాయిదాలలో మొత్తం రూ.3లక్షల ఆర్ధికసాయం అందజేస్తుంది. ఈ సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేదు. ఒక్కో నియోజకవర్గానికి 3,000 మంది చొప్పున రాష్ట్రంలో మొత్తం 4 లక్షల మందికి ఈ పధకం వర్తింపు.

• ఇదివరకు ఇళ్ళు నిర్మించుకొనేందుకు గృహనిర్మాణ సంస్థ ద్వారా తీసుకొన్న రూ.4,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. కనుక రుణం తీసుకొన్నవారు ఇక బాకీలు చెల్లించనవసరం లేదు.    

• ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలో గొర్రెల పంపిణీ. ఒక్కొక్కరికీ 20 గొర్రెలు చొప్పున రాష్ట్రంలో 7.31 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఆగస్ట్ నెలాఖరులోగా ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తిచేయాల్సి ఉంటుంది.  

• త్వరలోనే పోడు భూముల పట్టాలు పంపిణీ. మొత్తం 4 లక్షల ఎకరాలు  పోడు భూములను 1,55,393 మంది అడవిబిడ్డలకు పంపిణీ చేస్తారు. 

• హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల ఎత్తైన డా.అంబేడ్కర్ విగ్రహం ఏప్రిల్ 14న ఆవిష్కరణ. 

• కాశీ, శబరిమల వెళ్ళే తెలంగాణ భక్తుల కోసం రూ.25 కోట్లు వ్యయంతో ఒక్కో వసతి గృహం నిర్మాణానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు.


Related Post