72 సీట్లు మావే... రేవంత్‌ రెడ్డి ధీమా ఏమిటో?

March 09, 2023


img

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్రకి, దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగసభలకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్న మాట నిజం. ఆయన పాదయాత్రలో మీడియాకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 72 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రాబోతోంది. బిఆర్ఎస్ కేవలం 25 సీట్లకే పరిమితం కాబోతోంది. ఇక బిజెపి సింగిల్ డిజిట్‌కే పరిమితం కావచ్చు. గత 8 ఏళ్లుగా కేసీఆర్‌ కుటుంబ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో మార్పు తధ్యం. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతోనూ మేము పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తాము. ఇప్పటికే 60 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాము. కనుక ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే మిగిలిన అభ్యర్ధులని ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రకటించి ప్రజల మద్యకు వెళ్తాము,” అని చెప్పారు. 

తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా బలమైన సీనియర్ నేతలు చాలామందే ఉన్నారు. అయితే పార్టీ బలహీనపడినప్పటికీ ఇంతకాలం సీనియర్ నేతలు కుమ్ములాడుకొంటూ కాలక్షేపం చేయడం వలన పార్టీ తీవ్రంగా నష్టపోయింది. కానీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావు థాక్రే వచ్చిన తర్వాత పార్టీలో కుమ్ములాటలు తగ్గి అందరూ కలిసికట్టుగా పనిచేయడం ప్రారంభించారు. అందుకే రేవంత్‌ రెడ్డి సభలకి అంతమంచి స్పందన వస్తోందని భావించవచ్చు. ఇదే లెక్కన సీనియర్లందరూ కలిసి పనిచేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బిఆర్ఎస్‌కి  ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్‌ నేతల ఐక్యత ఎంతకాలం నిలుస్తుందో వారికే తెలియదు. ఎన్నికల గంట మ్రోగితే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ టికెట్ల కోసం కుమ్ములాటలు మొదలైపోతాయని అందరికీ తెలుసు.


Related Post