కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు

March 08, 2023


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రశ్నించేందుకు సిఎం కేసీఆర్‌ కుమార్తె, బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈనెల 10వ తేదీన ఢిల్లీకి రావలసిందిగా ఈడీ నోటీసు పంపింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆమెకు బినామీగా ఉంటూ ఈ ఈ కుంభకోణంలో కీలకపాత్ర నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన అరుణ్ పిళ్లైను మంగళవారం రాత్రే ఈడీ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నేటి నుంచి వారంరోజుల పాటు ఆయనని తమ అధీనంలో ఉంచుకొని ప్రశ్నించబోతున్నారు. ఇదే సమయంలో కల్వకుంట్ల కవితకు కూడా ఈడీ నోటీసు పంపడంతో కేసు విచారణ కీలకదశకు చేరుకొన్నట్లే భావించవచ్చు. 

ఈడీ తనకు నోటీసులు పంపబోతున్నట్లు ఆమెకు ముందుగానే తెలిసి ఉండవచ్చు. బహుశః అందుకే ఆమె ‘చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని’ కోరుతూ భారత్‌ జాగృతి అధ్వర్యంలో ఢిల్లీలో ఈనెల 10వ తేదీనే జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు బయలుదేరుతున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణలో భాగంగా గత ఏడాది డిసెంబర్‌లో సీబీఐ అధికారులు హైదరాబాద్‌ వచ్చి ఆమె నివాసంలోనే దాదాపు 5 గంటలసేపు ప్రశ్నించారు. మళ్ళీ అప్పటి నుంచి నేటి వరకు సీబీఐ, ఈడీలు ఆమె జోలికి రాలేదు కానీ ఈ కేసులో కీలకపాత్ర పోషించిన ఆడిటర్ బుచ్చిబాబు, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లై తదితరులను అరెస్ట్ చేశారు. 

కల్వకుంట్ల కవిత రాజకీయంగా చాలా బలమైన కుటుంబానికి చెందిన వ్యక్తి కనుక, ఆమె జోలికి వెళితే కేంద్రానికి, తెలంగాణలో బిజెపికి సమస్యలు ఎదుర్కోవలసివస్తుంది. కనుక ముందుగా ఈ కేసులో కీలకవ్యక్తులను అరెస్ట్ చేసి బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపించిన్నట్లు స్పష్టమవుతోంది. కనుక తెలంగాణ బిజెపి నేతలు చెపుతున్నట్లు ఈ కేసులో త్వరలోనే ఆమె అరెస్ట్ అనివార్యంగానే కనిపిస్తోంది.


Related Post