తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి ఎన్నికలకు సిఎం కేసీఆర్ ముగ్గురు బిఆర్ఎస్ అభ్యర్ధుల పేర్లను మంగళవారం ఖరారు చేశారు. దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలకు సిఎం కేసీఆర్ మండలి టికెట్స్ ఖరారు చేశారు. ముగ్గురూ ఎల్లుండి అంటే గురువారం నామినేషన్స్ వేస్తారు. అయితే ఇవి ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎన్నికలు కనుక వారి పేర్లను సిఎం కేసీఆర్ ఖరారు చేయడంతోనే వారు ఎమ్మెల్సీలుగా ఎన్నికైపోయిన్నట్లే. ఎన్నికలు కేవలం లాంఛనప్రాయమే.
అయితే గవర్నర్ కోటాలో కూడా ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇదివరకు పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయనందుకే సిఎం కేసీఆర్‌కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి మద్య ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఆ యుద్ధం ఇంకా తీవ్రమైంది. తెలంగాణ ప్రభుత్వం తనను రాష్ట్రానికి ప్రధమ మహిళనని కూడా గుర్తించి గౌరవించకుండా అవమానిస్తూనే ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్ననే రాజ్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కనుక ప్రస్తుత పరిస్థితులలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నామినేషన్ చాలా కష్టమే అని చెప్పవచ్చు.