దేశంలో బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారిలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. ఆ కారణంతోనే ఆయన సిఎం కేసీఆర్‌తో చేతులు కలిపారని భావించవచ్చు. కేసీఆర్ పూర్తిస్థాయి రాజకీయాలలో ఉన్నారు కనుక ఆయన చేస్తున్న పోరాటాలతో రాజకీయ లబ్ది పొందే అవకాశం ఉంది. లేదా నష్టపోవచ్చు. అది వేరే విషయం.
ప్రకాష్ రాజ్ మంచి నటుడుగా జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకొన్నారు. కనుక బిజెపిపై వ్యతిరేకతతో ఆయన హిందీ భాషని వ్యతిరేకిస్తున్నారు. దీని వలన చివరికి ఆయనే నష్టపోతారు.
ప్రకాష్ రాజ్ కూడా ఇప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమంలో తన గొంతు బలంగా వినిపిస్తున్నారు. “నాకు హిందీ రాదు... పోండి,” అంటూ వ్రాసున్న ఓ టీషర్ట్ ధరించి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే ఏం చేసుకొంటారో చేసుకోండని చెపుతున్నట్లు భావించవచ్చు.
“నా మూలాలు, నా మాతృభాష కన్నడ. దానిని నువ్వు అగౌరవపరిస్తే, నీ భాషని మాపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తే... మేము ఈవిదంగా నిరసనలు తెలియజేసి వ్యతిరేకిస్తుంటాము. మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారా జస్ట్ ఆస్కింగ్,” అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
దానిపై అప్పుడే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు మొదలైపోయాయి కూడా. అయితే ప్రకాష్ రాజ్ కూడా అంత త్వరగా వెనక్కు తగ్గేరకం మనిషి కాదు కనుక ఈ భాషాయుద్ధం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని చెప్పవచ్చు.
అయితే ఈ యుద్ధంతో ప్రకాష్ రాజ్ ఏం సాధించగలరు?మహా అయితే కర్ణాటక శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తే గెలవగలరు. లేదా దక్షిణాది రాష్ట్రాలలో హిందీ వ్యతిరేకులను ఆకట్టుకోగలరు. కానీ దీంతో ఆయన సినిమా అవకాశాలు పెరుగవు. నటుడిగా కొత్త గుర్తింపు రాదు. కానీ ఇప్పుడిప్పుడే తెలుగు, కన్నడ సినీ పరిశ్రమ పాన్ ఇండియా స్థాయికి, ఆస్కార్ స్థాయికి కూడా ఎదుగుతోంది. కనుక నటుడిగా ప్రకాష్ రాజ్‌కు చాలా గొప్ప అవకాశాలు, వాటితో ఇంకా మంచి గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులను మెప్పించగలిగితే ఆయన జాతీయస్థాయి నటుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఆయన బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలని వ్యతిరేకిస్తే నష్టం లేదు కానీ ఆ క్రమంలో ఆయన హిందీని వ్యతిరేకిస్తుండటమే పెద్ద తప్పవుతుంది. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైతే నష్టపోవడం ఖాయం. కనుక ఇటువంటి వాటికి ముఖ్యంగా రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.