టిఆర్ఎస్‌ పేరు మార్చి కేసీఆర్‌ తప్పు చేశారా?

March 06, 2023


img

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనే ఆలోచనలు చేస్తూ కొత్త పార్టీ స్థాపించడమా లేక టిఆర్ఎస్‌ పేరు మార్చడం మంచిదా అని న్యాయనిపుణుల, ఎన్నికల అధికారులతో చర్చించి, కొత్తగా పార్టీ స్థాపించడం కంటే టిఆర్ఎస్‌ పేరుని బిఆర్ఎస్‌గా మార్చుకోవడమే సులువు అని తెలుసుకొని పార్టీ పేరు మార్చుకొన్నారు. బహుశః టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరైనా పేరు మార్చుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారా?దాని వలన కలిగే నష్టాలను కేసీఆర్‌కు వివరించారా?లేక పిల్లి మెడలో గంటెవరు కడతారన్నట్లు అందరూ కేసీఆర్‌కు భయపడి వంతపాడారా? అసలు కేసీఆర్‌ వారందరితో చర్చించారా లేక ఏకపక్షంగా నిర్ణయం తీసుకొన్నారా?అనేది ఇప్పుడు అప్రస్తుతం. 

కానీ పేరు మార్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు టిఆర్ఎస్‌కు తెలంగాణ రాష్ట్రంతో, ప్రజలతో బంధం తెగిపోయిందంటూ ప్రచారం ప్రారంభించాయి. ఆ ప్రచారాన్ని కూడా కేసీఆర్‌ తీవ్రమైనదిగా పరిగణించిన్నట్లు లేరు. అందుకే బిఆర్ఎస్‌ పార్టీని ఇతర రాష్ట్రాల విస్తరణపైనే శ్రద్ద చూపారు తప్ప పేరు మార్పుపై పార్టీకి జరుగుతున్న నష్టాన్ని తగ్గించే ప్రయత్నలేవీ చేయలేదు. బిఆర్ఎస్‌ అంటే టిఆర్ఎస్‌ పార్టీయే అని గ్రామీణ ప్రజలకు గట్టిగా నొక్కి చెప్పే ప్రయత్నాలు చేయలేదు. 

తెలంగాణలో మంచి ‘బ్రాండ్ నేమ్’ కలిగిన టిఆర్ఎస్‌లో తెలంగాణని వదులుకొన్నందున కేసీఆర్‌ బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి దేశానికి ప్రధాని కాగలిగితే, ఈ నష్టాన్ని పెద్దగా పట్టించుకోనక్కరలేదు. కానీ జాతీయ రాజకీయాలు, ప్రధాని పదవి అనే ఎండమావి వెంట పరుగులు తీస్తూ తెలంగాణలో నష్టపోతే మళ్ళీ కోలుకోవడం చాలా కష్టమే. 

సిఎం కేసీఆర్‌ చేజేతులా తన మోస్ట్ పాపులర్ బ్రాండ్ నేమ్ టిఆర్ఎస్‌ని వదులుకొన్నారు కనుక దానిని సద్వినియోగించుకోవాలని వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారని, తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి లేదా టిఆర్ఎస్‌ అని చెప్పుకొనేవిదంగా తగిన పేరుతో, ఇంచుమించు గులాబీరంగు జెండాతో రాష్ట్రంలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గత వారం రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా మరొకరు ఈ కొత్త పార్టీని స్థాపించబోతున్నారని, ఇప్పటికే ఈ మూడు ఉభయ జిల్లాలకు చెందిన 30 మంది నేతలు దీని కోసం చేతులు కలిపారని ఆ వార్తల సారాంశం. తాము అధికారంలోకి రాలేకపోయినప్పటికీ ఈ టిఆర్ఎస్‌ బ్రాండ్ నేమ్‌తో కనీసం ఓ 20-30 సీట్లు గెలుచుకొంటె చాలు కింగ్ మేకర్స్ అవ్వొచ్చని వారు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

కనుక వచ్చే ఎన్నికలలో బిజెపిని నిలువరించడంతో పాటు తన పాపులర్ బ్రాండ్ వలన కలిగే నష్టం జరుగకుండా కేసీఆర్‌ జాగ్రత్తపడటం చాలా అవసరమే!  


Related Post