తెలంగాణలో మోడీ అధ్యక్షతన బిజెపి ప్రభుత్వమా... ఇదేందన్నా!

March 04, 2023


img

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలనే ప్రయత్నంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉపఎన్నికలలో కేసీఆర్‌ చేతిలో పరాభవం పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. తర్వాత ఆలయ ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ, “మునుగోడు ఉపఎన్నికలతో రాష్ట్రంలో టిఆర్ఎస్‌ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం కేసీఆర్‌ గ్రహించారు. అందుకే పార్టీ పేరును బిఆర్ఎస్‌గా మార్చుకొన్నారు. అయితే పార్టీ పేరు మార్చుకొన్నప్పటికీ రాబోయే ఎన్నికలలో తెలంగాణలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్‌ కుమార్తె త్వరలోనే జైలుకి వెళ్ళడం ఖాయం. ఆ అవినీతి సొమ్ముతోనే ఆమె ఢిల్లీలో 600 మద్యం షాపులు పెట్టారు,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

“బిజెపి నేతలు చెపితే సీబీఐ అధికారులు నన్ను అరెస్ట్ చేస్తారా? అయితే ఇక సీబీఐ ఎందుకు... బిజెపి నేతలే సీబీఐ అధికారులుగా వ్యవహరిస్తే సరిపోతుంది కదా?” అని కల్వకుంట్ల కవిత ఘాటుగా బదులిచ్చారు. 

రాష్ట్ర బిజెపి నేతలు ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళడం ఖాయమని చెపుతుండటం బహుశః కేసీఆర్‌ కుటుంబంపై, ముఖ్యంగా ఆమెపై ఒత్తిడి పెంచడానికే అయ్యుండవచ్చు లేదా హటాత్తుగా ఆమెని అరెస్ట్ చేస్తే బిఆర్ఎస్‌ పార్టీ శ్రేణులు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించవచ్చు కనుక ఇప్పటి నుంచే ప్రజలని, బిఆర్ఎస్‌ శ్రేణులని అందుకు మానసికంగా సిద్దం చేస్తూ, వారు హడావుడి చేస్తే దాని ప్రభావం తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నంగా కూడా చూడవచ్చు. 

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి “రాబోయే ఎన్నికలలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో అని చెప్పవలసి ఉండగా ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బిజెపి అధికారంలోకి రావడం ఖాయం,” అని చెప్పడం విచిత్రంగా ఉంది. బహుశః బండి సంజయ్‌తో విభేధాలు మొదలయ్యి ఉండవచ్చు లేదా ఒకవేళ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే బండి సంజయ్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఇప్పటి నుంచే తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పాలనుకొంటున్నారేమో?


Related Post