ఇటీవల యువత కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. శుక్రవారం మేడ్చల్ వద్ద సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి గుండెపోటుతో చనిపోగా ఈరోజు ఉదయం ఏపీలోని ఒంగోలు జిల్లాలో వాకవారిపాలెం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న పాలపర్తి వీరబాబు తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెపుతుండగా హటాత్తుగా కుప్పకూలిపోయారు. విద్యార్థులు వెంటనే ఇతర ఉపాధ్యాయులకు తెలియజేయడంతో వారు 108 అంబులెన్సుని రప్పించారు. కానీ అప్పటికే వీరబాబు చనిపోయిన్నట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరికీ ‘సీపీఆర్’ చేయడం తెలియనందున అంబులెన్స్ వచ్చేవరకు ఎదురుచూశారు. ఒకవేళ సీపీఆర్ చేసి ఉండి ఉంటే మాస్టారు బ్రతికి ఉండేవారేమో?
గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక మంది గుండెపోటుతో చనిపోతూనే ఉన్నారు. వారిలో యువత సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం ఆందోళనకరమైన విషయమే. ఈ సమస్య ఒక్క భారత్‌లోనే కాదు... కరోనా మహమ్మారితో విలవిలలాడిన అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో కూడా ఉంది. అంటే వాక్సిన్ తీసుకొని కరోనా నుంచి విముక్తి పొందినప్పటికీ, కరోనా దుష్ప్రభావాలు చాలా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా గుండె సంబందిత వ్యాధులతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు, దీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై కరోనా తదనంతర ప్రభావం కనిపిస్తోందని చెపుతున్నారు.
అయితే ఇది కరోనా తదనంతర ప్రభావమా లేక వాక్సిన్ సైడ్-ఎఫెక్ట్స్?అనే చర్చ కూడా నడుస్తోంది. కరోనాకి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కొత్తలోనే ఈ వాదన వినిపించిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. కరోనా వాక్సిన్‌తో గుండెపోటు వస్తుందనే భయంతో భారత్, అమెరికాలతో సహా పలు దేశాలలో ప్రజలు వాక్సిన్ వేసుకొనేందుకు వెనుకంజవేశారు. అమెరికాలో వాక్సిన్ వేయించుకొనేవారికి ప్రభుత్వం బహుమానాలు, బీర్లు, విద్యార్ధులైతే స్కాలర్‌షిప్పులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక నానాటికీ పెరుగుతున్న ఈ గుండెపోటు మరణాలు కరోనా వలన వస్తున్నాయా లేక దాని కోసం తీసుకొన్న వాక్సిన్ వలన వస్తున్నాయా?అనేది తెలవలసి ఉంది.
అయితే ఏ కారణం చేత గుండెపోటు వస్తున్నప్పటికీ ప్రజలందరూ అత్యవసర చికిత్సా విధానమైన ‘సీపీఆర్’ చేయడం నేర్చుకోవలసిన అవసరం ఏర్పడిందిప్పుడు. ముఖ్యంగా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, మునిసిపల్ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు అందరూ సీపీఆర్ శిక్షణ పొందడం చాలా అవసరం. అలాగే అందరూ ఎప్పటికప్పుడు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవడం, గుండెపోటు వస్తే వాడదగ్గ అత్యవసర మందులను సిద్దంగా ఉంచుకోవడం మంచిది. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులందరికీ సీపీఆర్ శిక్షణ ఇప్పిస్తోంది.