కేటీఆర్‌ సాధించలేనిది... జగన్‌ ఎలా సాధించారో?

March 04, 2023


img

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ చొరవతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలు వస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రెండు నెలల్లోనే ఒక్క హైదరాబాద్‌లోనే మూడు నాలుగు కంపెనీలు ప్రారంభం అయ్యాయి. మంత్రి కేటీఆర్‌ ఏటా దావోస్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో పర్యటిస్తూ పెట్టుబడులు సాధించుకొస్తుంటారు. తద్వారా ఏడాదికి దాదాపు లక్ష కోట్లు పెట్టుబడులు, వాటి ద్వారా 20-30 వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నారు. 

అయితే నిన్నటి నుంచి విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో తొలిరోజే ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 340 కంపెనీలతో ఎంవోయూలు వాటి ద్వారా ఏపీలో 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం విశేషం. ఏపీకి విశాఖ రాజధానిగా ఉంటుందని చెప్పారు. 

ఈ సదస్సుకు ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, సంజీవ్ బజాజ్, కృష్ణ ఎల్ల, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు అనేకమంది హాజరయ్యారు. వారిలో కొందరు పెట్టుబడులు పెడతామని ప్రకటించగా, చాలామంది ‘జగన్‌ విజనరీ’ అని ఆయన నేతృత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంశలకు పరిమితమయ్యారు! 

నిన్న జరిగిన సదస్సులో ఏపీకి విశాఖ రాజధాని కాబోతోందని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పుకోవలసి రావడం దౌర్భాగ్యమే అనుకోవచ్చు. ఎందుకంటే ఏపీకి రాజధాని లేదని పెట్టుబడిదారులకు చెప్పుకోవలసి రావడం సిగ్గుచేటే కదా?చంద్రబాబు అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే, జగన్‌ దానిని కాదని విశాఖ రాజధాని అంటున్నారు. కానీ ఏపీలో ప్రభుత్వం మారి మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే? అమరావతి రాజధాని అనడం ఖాయం! అంటే రాజధాని ఏదో ఎక్కడ ఉంటుందో కూడా తెలుసుకోకుండానే పెట్టుబడిదారులు 13 లక్షలు పెట్టుబడి పెట్టేశారంటే నమ్మశక్యంగా ఉందా? 

తెలంగాణలో అన్ని విధాలా అభివృద్ధి చెందిన రాజధాని హైదరాబాద్‌ నగరం, సుస్తిరమైన ప్రభుత్వం, చక్కటి పారిశ్రామిక విధానాలు, మిగులు విద్యుత్‌ ఉన్నాయి. అత్యంత సమర్ధుడైన మంత్రి కేటీఆర్‌, ఆయన అధికారుల బృందం ఎంతో కృషి చేస్తే ఏడాదికి దాదాపు లక్షకోట్లు పెట్టుబడులు సాధించగలుగుతోంది. 

కానీ ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయవలసిన మంత్రులే మూడు రాజధానుల పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ రోడ్లపైకి తెచ్చి ఆందోళనలు చేయిస్తుంటే, విశాఖని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఓ మంత్రి డిమాండ్‌ చేస్తుంటే, వచ్చే ఎన్నికలలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందో లేదో తెలీని పరిస్థితులలో పారిశ్రామికవేత్తలు ఏపీలో 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతారంటే నమ్మశక్యంగా లేదని ఏపీ ప్రజలే అనుకొంటున్నారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలే విద్యుత్‌ కోతలు, వైసీపీ నేతల వేధింపులు, ఒత్తిళ్ళు భరించలేక మూసుకొని తెలంగాణకి వెళ్ళిపోతుంటే, వాటిని చూస్తూ కూడా ఏపీలో కొత్తగా 340 కంపెనీలు ఏర్పాటు చేయడానికి వచ్చేయంటే నమ్మశక్యంగా ఉందా? 

ఒకే ఒక సదస్సుతో 13 లక్షల కోట్లు పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాలు సాధ్యమైతే మంత్రి కేటీఆర్‌ ఇంతగా ఎందుకు శ్రమపడేవారు? తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాగే ఓ సదస్సు నిర్వహించి ఉండేది కదా?  

మంత్రి కేటీఆర్‌ దేశవిదేశాలు తిరిగి పెట్టుబడులు సాధించుకొస్తుంటే, ఏపీ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి “మేము దావోస్ వెళ్ళక్కరలేదు... మా సిఎం జగన్‌ ఇమేజ్‌ని చూసి పెట్టుబడిదారులే ఏపీకి క్యూ కడతారని” చెప్పుకొంటారు. చిత్తూరులో వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతుంటే, “పోతే పోనీ...” అంటారు. హైదరాబాద్‌లో ఫార్ములా వన్ రేసింగ్ జరిగితే వచ్చి కేటీఆర్‌తో సెల్ఫీలు దిగి కోడి-గుడ్డు అంటూ మీడియాకి స్టోరీ చెపుతారు. 

రాజధాని ఏదో కూడా చెప్పలేని ముఖ్యమంత్రి, ఇటువంటి మంత్రులు, ఇటువంటి అస్థిర రాజకీయ వాతావరణం ఉన్న ఏపీలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధ్యమా?అంటే కాదనే అర్దమవుతోంది. అయితే ఇది ఎన్నికల సంవత్సరం కనుక ప్రజలకు చెప్పుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం ఏదోవిదంగా ఈ ఎంవోయులు చేయించుకొని ఉండవచ్చు. 

గతంలో చంద్రబాబు నాయుడు కూడా విశాఖలో సదస్సు నిర్వహించి ఏపీకి 14-16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని ఎంవొయూలు చూపించారు. కానీ నేటికీ ఏపీ యువత హైదరాబాద్‌కి వలసలు వస్తూనే ఉందంటే అర్దం ఏమిటి? ఏపీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే టిడిపి, వైసీపీలు ప్రజలతో ఆడుకొంటున్నాయని అర్దం అవుతోంది.


Related Post