పొంగులేటీ... ఇదేం ఐడియా బాసు... కొంప ముంచేలా ఉన్నావే!

March 03, 2023


img

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రాజకీయాలలో మంచి పట్టున్న నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇంతకాలం ఆయన బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కానీ కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోయిన్నట్లు, పువ్వాడ అజయ్ కుమార్‌ వంటి నాయకులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సిఎం కేసీఆర్‌ పొంగులేటిని పట్టించుకోవడం మానేశారు. ఇంతకాలం ఆయన చాలా ఓపికగా సిఎం కేసీఆర్‌ ఏమైనా పిలిచి మాట్లాడుతారేమో అని ఎదురుచూశారు. కానీ కేసీఆర్‌ నుంచి పిలుపు రాలేదు. 

ఖమ్మం జిల్లాకే చెందిన తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి కూడా మొన్నటివరకు ఇంచుమించు ఇలాగే ఉండేది. ఆయన పార్టీలో నుంచి జంప్ అవుతానని కేసీఆర్‌కు సిగ్నల్స్ పంపించడంతో మంత్రి హరీష్‌ రావుని పంపించి బుజ్జగించారు. దాంతో ఆయన చల్లబడి ఖమ్మంలో బిఆర్ఎస్ సభని విజయవంతం చేసేందుకు తోడ్పడ్డారు. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకొన్నారు. 

అయితే సిఎం కేసీఆర్‌ తుమ్మలని బుజ్జగించారు కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మాత్రం పట్టించుకోలేదు. ఖమ్మం సభకి వచ్చిన మంత్రి హరీష్‌ రావుతో సహా ఎవరూ ఆయన వైపు తొంగి చూడలేదు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాస్త స్పీడు పెంచి రెండు జిల్లాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ తన అనుచరులు చేజారిపోకుండా కాపాడుకొంటున్నారు. 

ఆయన కేసీఆర్‌ మీద బహిరంగంగా విమర్శలు, ఆరోపణలు చేయడం మొదలుపెట్టగానే, అటువంటి బలమైన నాయకుడు కోసమే ఎదురుచూస్తున్న బిజెపి, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆయన ఇంటి ముందు వాలిపోయి ఆహ్వానాలు పలికారు. కానీ పూర్వం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కనుక వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరేందుకు సిద్దపడుతున్నారని ఊహాగానాలు వినిపించాయి. 

అయితే ఇంతవరకు ఆయన ఏ పార్టీలోను చేరలేదు. తాజాగా ఓ బాంబ్ పేల్చబోతున్నట్లు సమాచారం. అదేమిటంటే, ఏదో ఓ పార్టీలో చేరడం కంటే సొంతంగా పార్టీ పెట్టుకోవాలని! దానికి నో అబ్జక్షన్! అయితే ఆ పార్టీకి తెలంగాణ రైతు సమితి (టిఆర్ఎస్‌) అని పెట్టుకోబోతున్నారట!

పార్టీ జెండా, గుర్తు అన్ని ఇంచుమించు టిఆర్ఎస్‌ని పోలి ఉండవచ్చని తెలుస్తోంది. సిఎం కేసీఆర్‌ ఎలాగూ టిఆర్ఎస్‌ పేరును బిఆర్ఎస్‌గా మార్చేసుకొన్నారు కనుక టిఆర్ఎస్‌ పేరుతో ఎన్నికలకి వెళితే ‘లక్కీ లాటరీ’ తగలవచ్చునని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. 

ఒకవేళ ఆయన టిఆర్ఎస్‌ పేరుతో నిజంగా పార్టీ స్థాపించి ఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధులుగా చాటింపు వేసుకొంటూ బరిలో దిగితే ఏమవుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు. టిఆర్ఎస్‌ ఎన్నికల గుర్తు కారుని పోలీన్నట్లున్న రొట్లే కర్ర, కెమెరా, బస్సు, రోడ్డు రోలరు వంటి గుర్తులకే గుద్దెసిన ఓటర్లు, టిఆర్ఎస్‌ పేరుతో పొంగులేటి అభ్యర్ధులని నిలబెడితే కాదంటారా?ఇదేదో బిఆర్ఎస్‌ కొంప ముంచే ఐడియాలాగే ఉంది కదా?


Related Post