ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరే కదా? గవర్నర్‌ తమిళిసై ట్వీట్‌

March 03, 2023


img

 తెలంగాణ ప్రభుత్వం-రాజ్‌భవన్‌ మద్య మరోసారి యుద్ధం మొదలైంది. శాసనసభ ఆమోదించి పంపిన 10 బిల్లులని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించకుండా తొక్కిపెట్టి ఉంచారని, తద్వారా గవర్నర్‌ నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం చెందారని, రాజ్యాంగ బద్దమైన తన బాధ్యతలను, విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని, చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పరిగణించి తక్షణం ఆ బిల్లులు ఆందించవలసిందిగా ఆమెను ఆదేశించవలసిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం పంపబోయే అన్ని బిల్లులకి గవర్నర్‌ తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాలని కూడా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని కోరింది. 

తనపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెంటనే స్పందిస్తూ, డియర్ తెలంగాణ సిఎస్ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశ్యించి “ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ మీకు దగ్గరగానే ఉంది కదా? సిఎస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతవరకు అధికారికంగా రాజ్‌భవన్‌ వచ్చి నన్ను కలిసేందుకు తీరికే దొరకలేదా? ప్రోటోకాల్ పాటించరు. కనీసం మర్యాదపూర్వకంగా కలవరు. స్నేహపూర్వక అధికారిక పర్యటనలు, చర్చలతో సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు కానీ మీరది కోరుకోవడం లేదు,” అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ట్వీట్‌ చేశారు. 

 

అంటే గోటితో పోయేదానికి గొడ్డలిని వాడిన్నట్లు, రాజ్‌భవన్‌కి వచ్చి మాట్లాడుకొంటే పరిష్కారం అయ్యే సమస్యలపై కేసీఆర్‌ ప్రభుత్వం పంతానికి పోయి సుప్రీంకోర్టు వరకు వెళుతోందని, సిఎం కేసీఆర్‌ తనను గౌరవిస్తే తాను కూడా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్దంగా ఉన్నానని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి తాజా ట్వీట్‌ ద్వారా తెలియజేశారనుకోవచ్చు. 

ఓ రాష్ట్ర గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయడం ఎంత విడ్డూరమో, ఓ రాష్ట్ర గవర్నర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బాధ్యతలు గుర్తుచేస్తూ ట్వీట్‌ చేయడం అంతే విచిత్రమని చెప్పవచ్చు. 

అయితే గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేజేతులా మరో కొత్త సమస్యని తెచ్చిపెట్టుకొన్నట్లే అని చెప్పవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు గవర్నర్‌ని మందలించి బిల్లులన్నీ ఆమోదించమని ఆదేశిస్తే, ఇకపై గవర్నర్‌ ఇంకా బిగుసుకుపోవడం ఖాయం. 

ఒకవేళ గవర్నర్‌ విచక్షణాధికారాలలో న్యాయవ్యవస్థలు జోక్యం చేసుకోలేవని సుప్రీంకోర్టు చెపితే అది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం అవుతుంది. కనుక గవర్నర్‌ సూచించిన్నట్లు సిఎస్ రాజ్‌భవన్‌కు వెళ్ళి మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవడమే అన్నివిదాల మంచిది. కాదని పంతాలకు పోతే ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి.



Related Post