భోగ శ్రావణి ఆరోపణలు నిజమేనా?

March 03, 2023


img

జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్‌ భోగ శ్రావణి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో గురువారం కాషాయ కండువా కప్పుకొని బిజెపిలో చేరిపోయారు. కొన్నివారాల క్రితం ఆమె జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ వేధిస్తున్నారంటూ ఆరోపించి మున్సిపల్ ఛైర్ పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఆమె అంత తీవ్ర ఆరోపణలు చేస్తూ పదవికి రాజీనామా చేసినప్పటికీ బిఆర్ఎస్ అధిష్టానం స్పందించకపోవడంతో మూడు రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. బిఆర్ఎస్‌లో ఇటువంటి అసంతృప్త నేతల కోసం చూస్తున్న బిజెపి నేతలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్‌ వెంటనే ఆమె ఇంటికి వెళ్ళి బిజెపిలోకి ఆహ్వానించగా ఆమె అంగీకరించి బిజెపిలో చేరిపోయారు. ఆమెతో పాటు ఆమె అనుచరులు కొందరు బిజెపిలో చేరారు. 

అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, బిఆర్ఎస్‌లో మహిళలకు సముచిత గౌరవం లేకపోగా నా వంటి మహిళలని పార్టీలో నేతలే వేధిస్తున్నారు. ఇక రాష్ట్రంలో మహిళలకి ఏవిదంగా రక్షణ కల్పిస్తుంది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం? అందుకే నేను నా పదవులకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నాను. ఇకపై జగిత్యాలలో బిజెపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను,” అని అన్నారు. 

ఏ ప్రభుత్వం, పార్టీలోనైనా పదవుల కోసం చాలా పోటీ ఉంటుంది. బిఆర్ఎస్ పార్టీ ఆమెకి జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్‌ పదవి ఇచ్చింది. కనుక బిఆర్ఎస్‌లో సముచిత గౌరవం లభించలేదనుకోలేము. అయితే తనని ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ వేధిస్తున్నప్పుడు ఆ విషయం మంత్రుల ద్వారా పార్టీ అధిష్టానానికి తెలియజేసి ఉండాలి. ఆమె ఆవిదంగా చేసినా పార్టీ అధిష్టానం పట్టించుకోకపోయుంటే ఆమె ఆరోపణలలో నిజముందని భావించవచ్చు. 

కానీ ఆమె పార్టీ అధిష్టానానికి తెలియజేయకుండా నేరుగా విలేఖరుల సమావేశంలో ఈ విషయం బయటపెట్టి ఉండి ఉంటే మీడియా సమావేశం, దానిలో ఆరోపణలు, పదవికి రాజీనామా అన్నీ బిజెపి వ్యూహంలో భాగమై ఉండవచ్చుని అనుమానించక తప్పదు. బహుశః బిజెపి ఆమెకు ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్ చేసి ఈవిదంగా బిఆర్ఎస్‌లో నుంచి బయటకు రావాలని సూచించి ఉండవచ్చు. తద్వారా ఆ ఎమ్మెల్యేని, నియోజకవర్గంలో బిఆర్ఎస్‌ని రాజకీయంగా కొంత దెబ్బ తీయవచ్చని బిజెపి భావించి ఉండవచ్చు కదా? 

ఆమె ఏ కారణంగా బిఆర్ఎస్‌ని వీడినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఇటువంటి ఆరోపణలు చేసి బిజెపిలోకి వెళ్ళిపోవడం వలన జగిత్యాలలో బిఆర్ఎస్‌కి రాజకీయంగా ఎంతో కొంత నష్టం జరిగిన్నట్లే భావించవచ్చు.    



Related Post