తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రసంగించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో, రాజ్‌భవన్-రాష్ట్ర ప్రభుత్వం మద్య సయోధ్య కుదిరిన్నట్లే కనిపించింది. కానీ నేటికీ ఆమె 10 బిల్లులని ఆమోదించకుండా తొక్కి పెట్టి ఉంచడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
శాసనసభ ఆమోదించిన బిల్లులని ఆమె ఆమోదించకుండా తొక్కి పట్టి ఉంచుతుండటం వలన పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని కనుక ఆ బిల్లులని ఆమోదించవలసిందిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
దీంతో రాజ్‌భవన్-రాష్ట్ర ప్రభుత్వం మద్య మళ్ళీ కొత్త యుద్ధం మొదలైన్నట్లయ్యింది. పంజాబ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర గవర్నర్‌ని రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలంటూ సున్నితంగా మందలించింది. కనుక తెలంగాణ గవర్నర్‌ని కూడా సుప్రీంకోర్టు దారిలో పెడుతుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అర్దమవుతోంది.
అయితే శాసనసభ ఆమోదించిన బిల్లులని గవర్నర్ నిర్ధిష్ట సమయంలోగా ఆమోదించాలనే నిబందన ఏదీ రాజ్యాంగంలో లేదు. కనుక ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోవచ్చు. అయితే సానుకూలంగా స్పందించవలసిందిగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. నిజానికి సిఎం కేసీఆర్ తన పంతాన్ని, భేషజాన్ని పక్కన పెట్టి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో నేరుగా మాట్లాడితే ఈ సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది. కానీ గవర్నర్‌పై సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం అంటే గోటితో పోయేడానికి గొడ్డలి వాడిన్నట్లే భావించవచ్చు.