అప్పుడు ర్యాంగింగ్ జరగలేదన్నారుగా...

March 02, 2023


img

వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీ (కెఎంసి) పీజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి సీనియర్ విద్యార్ధి డాక్టర్ సైఫ్ వేధింపులు భరించలేక విషపు ఇంజక్షన్ ఇచ్చుకొని ఆత్మహత్యాయత్నం చేసుకొన్నప్పుడు, ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ అటువంటిదేమీ జరుగలేదని కేవలం వారిరువురి మద్య కొన్ని విషయాలలో అభిప్రాయబేధాలు మాత్రమే ఉన్నాయని మీడియాకు చెప్పారు. కానీ డాక్టర్ ప్రీతి మృతిపై ప్రభుత్వం కమిటీ నియమించి విచారణకి ఆదేశించినప్పుడు, ఆయన కూడా ఆ కమిటీలో సభ్యుడుగా ఉండటాన్ని ప్రీతి సోదరుడు పృధ్వీ తప్పు పట్టారు. 

అప్పుడు ప్రీతిని ఎవరూ ర్యాంగింగ్ చేయలేదని చెప్పిన ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, అధ్యక్షతనే బుదవారం కెఎంసీలో 13 మంది కమిటీ సభ్యులు సమావేశమై ప్రీతి ర్యాంగింగ్‌కు గురయిన్నట్లు నిర్ధారించారు. సబ్జెక్ట్ సంబందించిన విషయంపై మాత్రమే కాకుండా ఇతర అంశాల కారణంగా అతను ప్రీతిని వేధించేవాడని నిర్ధారించారు. వాట్సప్ గ్రూపులలో అతను ప్రీతిని అవహేళన చేస్తూ మెసేజ్‌లు పెట్టేవాడని ధృవీకరించారు. అతను తనని వేధిస్తున్నాడని ప్రీతి ఫిర్యాదు చేసిందని, అప్పుడు అతనికి కౌన్సిలింగ్ కూడా చేశామని కమిటీ ధృవీకరించింది. 

అంటే ప్రభుత్వం ఆదేశించేకనే కెఎంసిలో వేధింపులు జరిగాయని, అందుకు ప్రీతి బలైందని అందరూ ఒప్పుకొన్నారని అర్దమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం విచారణకి ఆదేశించకపోయుంటే నేటికీ కెఎంసి ప్రిన్సిపల్‌తో సహా అందరూ ర్యాంగింగ్ జరగలేదని, ప్రీతి వేరే ఏదో సమస్య కారణంగా క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకొందని వాదిస్తుండేవారేమో?

ఒక మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబానికి చెందిన ప్రీతి అడుగడుగునా ఎన్నో కష్టాలు, సవాళ్ళు ఎదుర్కొన్న తర్వాతే ఈ స్థాయికి చేరుకోగలదని వేరే చెప్పక్కరలేదు. కనుక అటువంటి విద్యార్థులకి తోటి విద్యార్థులు, సీనియర్స్‌తో పాటు కాలేజీ యాజమాన్యం, ఎంజీఎం హాస్పిటల్‌ అధికారులు కూడా సహాయసహకారాలు అందించి ఉండాలి. కానీ ఆమె వేధింపులకి గురవుతున్నానని తెలిపినా, ఆత్మహత్యాయత్నం చేసి నీమ్స్ హాస్పిటల్‌లో చావు బ్రతుకుల్లో ఉన్నా ఎవరూ కనికరించలేదు!

పైగా ఆమెని వేధించిన డాక్టర్ సైఫ్‌కు సంఘీభావం తెలుపుతూ జూనియర్, సీనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి నిసిగ్గుగా ధర్నా కూడా చేశారు. తన గ్రామస్తులకి వైద్య సేవలు అందించాలని పరితపించిన డాక్టర్ ప్రీతి చనిపోయాక ఇప్పుడు తప్పు జరిగిందని అందరూ ధృవీకరిస్తున్నారు! ధర్నా చేసిన తోటి వైద్యులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు! అంటే ఓ నిండు ప్రాణం బలైతే తప్ప ఎవరూ స్పందించరా?మనుషుల ప్రాణాలు కాపాడే పవిత్రమైన వైద్యవృత్తిలో ఉన్నవారే సాటి డాక్టర్ చనిపోతుంటే ఈ విదంగా మాట్లాడటాన్ని, ప్రవర్తించడాన్ని ఏమనుకోవాలి? 


Related Post