తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బుదవారం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో జరిగియ రాష్ట్ర స్థాయి మహిళా మోర్చా సదస్సులో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఏ పార్టీతో పొత్తులు ఉండవు. రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మనమందరం కలిసి పనిచేయాలి. రాష్ట్రంలో ఎటు చూసిన హత్యలు, అత్యాచారాలే.
తెలంగాణ ఏప్రటుకి బిజెపి సాయపడితే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. వారి కోసమా ఇన్ని త్యాగాలు, పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకొన్నాము? ధనిక రాష్ట్రంగా చేతికండిన తెలంగాణని కేసీఆర్ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.6 లక్షల అప్పు ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఏ స్థాయికి దిగజారిందంటే నెలనెలా ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది. ఇందుకేనా తెలంగాణ సాధించుకొన్నది?అని రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు,” అని అన్నారు.
బండి సంజయ్ చెప్పిన విషయాలలో మిగిలిన అన్ని అంశాలని పక్కనపెడితే తెలంగాణలో బిజెపితో పొత్తులు పెట్టుకోవాలనుకొంటున్న పార్టీ ఒక్కటి కూడా లేదని అందరికీ తెలుసు. అందుకే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోమని చెపుతున్నారు. ఎలాగూ ఒంటరిపోరు చేయక తప్పదు కనుకనే ఒంటరిగా పోటీ చేస్తామని గొప్పగా చెప్పుకొంటున్నారు. బిజెపి ఏవిదంగా పోటీ చేయబోతున్నప్పటికీ, బలమైన బిఆర్ఎస్ నేతలని ఎదుర్కొని ఢీకొని ఓడించగల అభ్యర్ధులని ఇప్పటి నుంచే వెతికి పట్టుకోవడం మంచిది. లేకుంటే కేసీఆర్ చేతిలో బిజెపికి మరోసారి పరాభవం తప్పదు.