పోటీ చేద్దాం సరే... అభ్యర్ధులున్నారా?అమిత్ షా ప్రశ్న

March 01, 2023


img

వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ని ఓడించి రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పదేపదే చెపుతుంటారు. ఆయన నేతృత్వంలో తెలంగాణలో బిజెపి బలపడిన మాట వాస్తవం. కానీ నేటికీ 119 స్థానాలకి పోటీ చేసేందుకు బిజెపిలో అభ్యర్ధులు లేరు. కనుకనే ప్రత్యేకంగా చేరికల కమిటీని ఏర్పాటు చేసుకొని మరీ బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలని ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. చివరికి నలుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకి డబ్బు ముట్టజెప్పి కొనుగోలుచేయాలనే బిజెపి ప్లాన్ కూడా బెడిసికొట్టింది. 

ఇంకా ఎన్నికలకు 10 నెలల సమయం కూడా లేదు. బిజెపి అభ్యర్ధులను వెతుక్కొనేలోగా కేసీఆర్‌ ముందస్తుకి వెళితే బిజెపికి పరాభవం తప్పదు. ఒకవేళ అదే జరిగితే నాలుగేళ్ళుగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, బిజెపి పెద్దలు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. 

కనుక కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్ర బిజెపి నేతలని ఢిల్లీకి పిలిపించుకొని రాష్ట్రంలో బిజెపి పరిస్థితి, చేరికలు, అభ్యర్ధుల గురించి లోతుగా చర్చించారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూనే, ఇతర పార్టీలలో నుంచి బలమైన నేతలని బిజెపిలోకి ఆకర్షించాలని అమిత్‌ షా సూచించిన్నట్లు తెలుస్తోంది. ఈలోగా కేసీఆర్‌ని కట్టడి చేయడానికి కేంద్రం చేయగల పని ఎలాగూ చేస్తుందని అమిత్‌ షా వారికి హామీ ఇచ్చి ఉండవచ్చు. కనుక ఇకపై రాష్ట్ర బిజెపి నేతలు బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలలో పార్టీపై అసంతృప్తిగా ఉన్నవారిని గుర్తించి వారిని బిజెపిలో చేరేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు. 

కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం నిశ్చలంగా ఉన్నందున, ఏదో హడావుడి మొదలైతే తప్ప ఇతర పార్టీల నేతలని బిజెపిలోకి ఆకర్షించడం కష్టమే. ఐ‌టి, ఈడీ దాడులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టులతో ఆ హడావుడి సృష్టించే అవకాశం కనిపిస్తోంది. అయినా ఆర్ఎస్ఎస్, హిందుత్వ భావజాలం ఉన్న కార్యకర్తల నుంచి నాయకులను తయారుచేసుకొనే స్థితి నుంచి ఇతర పార్టీల నేతలనీ నయన్నో, భయన్నో పార్టీలో చేర్చుకొనే దుస్థితికి బిజెపి దిగజారడం చాలా బాధాకరమే.  


Related Post