మెడికల్ కాలేజీలలో ఆ నిబందన విద్యార్థుల పాలిట శాపం!

February 28, 2023


img

వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజిలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న డాక్టర్ ప్రీతి ఆత్మహత్యతో మరో కొత్త విషయం వెలుగు చూసింది. పీజీ విద్యార్థుల శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తుంది కనుక వారు మద్యలో ఏ కారణం చేతైనా వెళ్ళిపోతే ప్రభుత్వం చాలా నష్టపోవలసివస్తుంది. పైగా ఖాళీ అయిన ఆ సీటుని మరొకరికి కేటాయించలేదు కూడా. 

కనుక పీజీ విద్యార్థులు మద్యలో మానేయకుండా ఉండేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల జరిమానా చెల్లించాలనే నిబందన విధించింది. అయితే కొన్నిసార్లు ఇంకా మంచి కాలేజీలో సీటు లభించినప్పుడు కొందరు విద్యార్థులు రూ.20 లక్షల జరిమానా చెల్లించేసి వెళ్ళిపోతుండటంతో, ప్రభుత్వం దానిని రూ.50 లక్షలకి పెంచింది. తద్వారా కోర్సు మద్యలో వేరే కాలేజీకి మారాలనే ఆలోచన విరమించుకొంటారని ప్రభుత్వం ఉద్దేశ్యం. అయితే ఇదే జూనియర్ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని డాక్టర్ ప్రీతి విషయంలో బయటపడింది. 

తనని సీనియర్ విద్యార్ధి డాక్టర్ సైఫ్ వేధిస్తున్నాడని తమ కుమార్తె ప్రీతి తమతో చెప్పుకొని బాధపడేదని తల్లితండ్రులు, అక్క పూజ చెప్పారు. అయితే రూ.50 లక్షలు జరిమానా చెల్లించే స్థోమత లేకపోవడంతో, అతని వేధింపులు భరిస్తూనే ఏదోవిదంగా పీజీ పూర్తిచేస్తానని చెపుతుండేదని ప్రీతి తల్లితండ్రులు చెప్పారు. తాను చదువు పూర్తికాగానే తమ గ్రామంలోనే క్లినిక్ తెరిచి గ్రామస్తులందరికీ వైద్యం చేస్తానని తమ కుమార్తె ప్రీతి చెపుతుండేదని కానీ వేధింపులకి బలైపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రీతి గిరిజన కుటుంబం నుంచి వచ్చినందున, సహజంగానే కాలేజీలో సీనియర్స్, ఆమె తోటి విద్యార్థులు కూడా ఆమెని ర్యాంగింగ్ చేసి ఉండొచ్చు. వాటిని భరిస్తూ అత్యంత క్లిష్టమైన పీజీ కోర్సుని పూర్తి చేయడం అంటే మాటలు కాదు. వేధింపులు భరించలేకనే ప్రీతి ఆత్మహత్య చేసుకొందని స్పష్టమైంది. అదే... ఆమె మద్యలో కాలేజీ మానేసి ఉండి ఉంటే నేడు ప్రాణాలతో ఉండేది. ఆమె చేతిలో అప్పటికే ఎంబీబీఎస్ డిగ్రీ ఉంది కనుక డాక్టరుగా సేవలందించగలిగేది కూడా. కానీ ఈ రూ.50 లక్షల జరిమానా నిబందన కారణంగా ఆమె కాలేజీ వీడలేక చివరికి ప్రాణమే వీడింది. కనుక ప్రీతి మృతితోనైనా ప్రభుత్వం ఈ నిబందనని మార్చడం చాలా అవసరం. 


Related Post