తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఈరోజు హన్మకొండ జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుకొంటున్న డాక్టర్ ప్రీతి అనే అమ్మాయి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతే, ఈ ప్రతిపక్ష నాయకులు దానిపై కూడా రాజకీయాలు చేస్తున్నారు. వారు ఈ విషాద ఘటననని తమ రాజకీయాలకి వాడుకోవచ్చు కానీ మేము మాత్రం ఆ అమ్మాయి చనిపోయినందుకు ఎంతో బాధపడుతున్నాము.
మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత వెంటనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి తల్లితండ్రులని, కుటుంబ సభ్యులని ఓదార్చి ధైర్యం చెప్పారు. నేను ఈ వేదిక మీద నుంచి వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాను.
మా పార్టీ, మా ప్రభుత్వం, మా నేతలు అందరం వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను. ఆమె చావుకి కారణం అయినవారెవరైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వాడు సైఫ్ అయినా సంజయ్ అయినా చట్టపరంగా శిక్షపడేలా చేస్తాము,” అని అన్నారు.
సైఫ్ అయిన సంజయ్ అయినా అని మంత్రి కేటీఆర్ ఎందుకన్నారో అందరికీ తెలుసు. డాక్టర్ ప్రీతిని వేధించిన సీనియర్ డాక్టర్ సైఫ్ ముస్లిం. అతనిపై చర్య తీసుకొంటే మజ్లీస్‌కి కోపం వస్తుంది కనుక వెంటనే అతనిని అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. కానీ ఆ తర్వాత డాక్టర్ సైఫ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కనుక నేరస్తులని శిక్షించడానికి తమ ప్రభుత్వానికి హిందూ, ముస్లిం అనే తేడా చూపడాని మంత్రి కేటీఆర్ చెప్పిన్నట్లు భావించవచ్చు.