ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా ట్విట్టర్‌లో స్పందించారు. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంపై స్పందిస్తూ, “ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. ప్రధాని నరేంద్రమోడీ, అదానిల బందంపై నుంచి దేశప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి ఉండవచ్చని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు అభిప్రాయం వ్యక్తం చేశారు,” అని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అధికారులు తన కుమార్తె కల్వకుంట్ల కవిత పేరుని ప్రస్తావించినప్పుడు కానీ, హైదరాబాద్‌లో ఆమె నివాసంలో ప్రశ్నించినప్పుడు గానీ సిఎం కేసీఆర్ స్పందించలేదు. కానీ ఢిల్లీఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు స్పందించడం విశేషం. దీనిని ఆయన మోడీ-అదానీలకు ముడిపెట్టి విశ్లేషించడం ఆసక్తికరం.
అయితే బిజెపి మాజీ ఎంపీ వివేకా వెంకటస్వామి స్పందిస్తూ, “ఈ కేసుని సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతూ ఒకరొకరిని అరెస్ట్ చేస్తోంది. మనీష్ సిసోడియా తర్వాత బహుశః కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని సీబీఐ అరెస్ట్ చేయవచ్చు,” అని బాంబు పేల్చారు. ఒకవేళ సీబీఐ కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాజకీయాలలో పెను ప్రకంపనలు మొదలవుతాయని కేంద్రానికి, బిజెపికి కూడా తెలుసు. బహుశః అందుకే ఆమె విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు భావించవచ్చు.