మహారాష్ట్రని కూడా తెలంగాణలా అభివృద్ధి చేస్తాం: కవిత

February 25, 2023


img

శనివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్‌ పార్టీ మహారాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతుంది. ఎనిమిదేళ్ళ క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు, విద్యుత్‌ వంటి అన్ని సమస్యలని పరిష్కరించగలిగినప్పుడు ఇన్ని దశాబ్ధాలు గడుస్తున్నా మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? హైదరాబాద్‌లో 24 గంటలు నల్లాల ద్వారా నీళ్లు ఇస్తుంటే దేశ ఆర్ధికరాజధాని ముంబైలో రోజుకి రెండు గంటలే ఇస్తున్నారు. ఎందువల్ల?  తెలంగాణలో సాధ్యమైనది మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు?మహారాష్ట్రతో తెలంగాణ 1,000 కిమీ సరిహద్దు పంచుకొంది. కనుక తెలంగాణలో జరుగుతున్నా అభివృద్ధిని, అమలవుతున్న సంక్షేమ పధకాలని మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలవారికి బాగా తెలుసు. బిఆర్ఎస్‌ పార్టీని మహారాష్ట్రలో కూడా విస్తరించి ఇక్కడ కూడా అటువంటి అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలుకావాలని కోరుకొంటున్నారు,” అని అన్నారు.

మహారాష్ట్ర పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా చాలా అభివృద్ధి చెందింది కానీ రాష్ట్రంలో పలు జిల్లాలలో వ్యవసాయ రంగం, దానిపైనే ఆధారపడిన రైతన్నలు దయనీయస్థితిలో ఉన్నారు. ఇటీవల మహారాష్ట్రలో షోలాపూర్‌లో ఓ రైతు 512 కేజీల ఉల్లిపాయాలని వ్యవసాయ మార్కెట్‌లో అమ్మితే కేజీకి కేవలం ఒక్క రూపాయి చొప్పున రూ.512 వెలకట్టి, ఖర్చులు, ఫీజులు అన్నీ మినహాయించుకొని ఆ రైతు చేతిలో కేవలం రెండు రూపాయాలు పెట్టారు. అదీ... చెక్కు రూపంలో! మహారాష్ట్రలో రైతన్నల పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. కనుక రైతన్నలు తమ కష్టాలు తీర్చే నాధుడు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ నాధుడు కేసీఆరేనా? చూడాలి.


Related Post