సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతో ఏపీలో అన్ని స్థానాలకి పోటీ చేయించాలనుకొంటున్నారు. కనుక రాబోయే ఎన్నికలలో టిడిపి కూడా తెలంగాణలో పోటీ చేసేందుకు ఆయన అభ్యంతరం చెప్పలేరు. చెపితే అక్కడ ఏపీలో కేసీఆర్‌ని టిడిపి నిలదీయడం ఖాయం. కనుక చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి పగ్గాలని, రాష్ట్రంలో టిడిపిని మళ్ళీ బలోపేతం చేసే బాధ్యతని చంద్రబాబు నాయుడు కాసాని జ్ఞానేశ్వర్‌కి అప్పగించారు.
కాసాని నేతృత్వంలో ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగసభని విజయవంతంగా నిర్వహించారు. ఈసారి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. మార్చి 29వ తేదీన టిడిపి వ్యవస్థాపక దినోత్సవంనాడు పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభని నిర్వహించుదామనే కాసాని జ్ఞానేశ్వర్ సూచనకి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆమోదం తెలిపిన్నట్లు సమాచారం.
ఈ సభకి చంద్రబాబు నాయుడుతో సహా రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన టిడిపి నేతలందరూ హాజరవుతారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చుట్టుపక్కల జిల్లాలలో ఆంద్రావాసులు చాలా మంది స్థిరపడున్నారు కనుక ఈ సభకి వారందరినీ రప్పించి, తెలంగాణలో టిడిపి సత్తా మరోసారి చాటిచెప్పాలని కాసాని జ్ఞానేశ్వర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నాందేడ్ సభ తర్వాత మళ్ళీ బిఆర్ఎస్ హడావుడి ఏమీ లేదు. మార్చి నెలలోనే విజయవాడ లేదా విశాఖపట్నంలో సిఎం కేసీఆర్ భారీ బహిరంగసభ నిర్వహించబోతునట్లు సమాచారం. కనుక టిడిపి, బిఆర్ఎస్ సభలు రెండు తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ రాజకీయ వేడిని పెంచడం ఖాయం.