ఏపీ టిడిపి నేత నారా లోకేష్ గత 26 రోజులుగా ఏపీలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. నిన్న తిరుపతిలో ‘హలో లోకేష్’ పేరుతో యువతతో ముఖాముఖీ సభలో పాల్గొన్నప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఏపీలో రోజుకో దాడి జరుగుతుంటుంది. అదే... మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో రోజుకో పరిశ్రమ లేదా పెట్టుబడి వస్తుంటుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం కష్టం. కనుక ఏపీలో పరిశ్రమలు రావాలన్నా, మీకు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఏపీలో రెండు బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి చంద్రబాబు రెండు జగన్. చంద్రబాబు పేరు చెపితే పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తారు. అదే... జగన్ పేరు చెపితే అందరూ చంచల్‌గూడా జైలువైపు చూస్తారు. కనుక మీకు ఉద్యోగాలు కల్పించే చంద్రబాబు నాయుడు బ్రాండ్ కావాలో లేదా జైలు బ్రాండ్ ముఖ్యమంత్రి కావాలో మీరే నిర్ణయించుకోండి,” అని నారా లోకేష్ అన్నారు.
పొరుగు రాష్ట్రంలో యువనేత నారా లోకేష్ కూడా తెలంగాణలో శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని అంగీకరించి, తెలంగాణతో పోలిస్తే ఏపీ వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న ఈ పారిశ్రామికాభివృద్ధిని, రాష్ట్రానికి ప్రవాహంలా వస్తున్న పెట్టుబడుల గురించి ఏనాడూ మాట్లాడరు. ఎంతసేపు సిఎం కేసీఆర్‌ని లక్షయంగా చేసుకొని విమర్శిస్తూ అవినీతి జరిగిపోతోందని ఆరోపిస్తుంటారు. చివరికి పొరుగు రాష్ట్రం నుంచి ఊడిపడిన వైఎస్ షర్మిల కూడా కేసీఆర్‌ని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో మునిగి తేలుతున్నట్లయితే ఇంత తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఇంతగా ఎలా అభివృద్ధి చెందింది?రాష్ట్రానికి ఇన్ని వేలకోట్ల పెట్టుబడులు, ఇన్ని పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు ఎందుకు తరలివస్తున్నాయి?అనే ప్రశ్నలకు బహుశః కాంగ్రెస్, బిజెపి, వైఎస్ షర్మిల వద్ద సమాధానం ఉండకపోవచ్చు.