రోడ్లపై మనుషులను కుక్కలు పీక్కుతింటున్నా పట్టించుకోరా?హైకోర్టు ఆగ్రహం

February 23, 2023


img

ఐదు రోజుల క్రితం అంబర్ పేటలో ప్రదీప్ అనే నాలుగేళ్ళ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనని సుమోటో కేసుగా ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు జీహెచ్‌ఎంసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్లపై మనుషులను కుక్కలు పీక్కుతింటున్నా పట్టించుకోరా?హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే ఆ బాలుడు మరణించాడని హైకోర్టు అభిప్రాయపడింది. కనుక ఆ బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీదే అని స్పష్టం చేసింది. ఇటువంటి గాహనతలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. నగరంలో వీధి కుక్కలని నియంత్రించడానికి జీహెచ్‌ఎంసీ ఎటువంటి చర్యలు చేపడుతోందో వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణని మార్చి 16కి వాయిదా వేసింది. 

పీజీ విధ్యార్ధిని ఆత్మహత్య కేసు: 

ఇక కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న డాక్టర్ ప్రీతి తన సీనియర్ వేధింపులు భరించలేక బుదవారం ఉదయం విషపూరితమైన ఇంజక్షన్ చేసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో, మెరుగైన చికిత్స కోసం ఆమెని హైదరాబాద్‌ నీమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆమెని వెంటిలేటర్ మీద ఉంచి ఎక్మో సాయంతో ప్రాణాలు నిలబెడుతున్నారు. కానీ ఆమె శరీరం చికిత్సకి స్పందించడంలేదని నీమ్స్ సూపరింటెండెంట్‌ గురువారం సాయంత్రం తెలిపారు. 

డాక్టర్ ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలియడంతో ఏబీవీపి, భజరంగ్ దళ్, బిజెపి, బీఎస్పీ, గిరిజన సంఘాలు, నీమ్స్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్నారు. డాక్టర్ ప్రీతిని వేధించి ఆత్మహత్య చేసుకొనేందుకు కారకుడైన వ్యక్తిని తక్షణం అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌పై చేస్తున్నారు. అలాగే ప్రీతి ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకొని కెఎంసి ప్రిన్సిపల్‌ డాక్టర్ మోహన్ దాసుపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 


Related Post