ఇతర రాష్ట్రాలకి బిఆర్ఎస్‌ విస్తరణ అంత తేలిక కాదేమో?

February 22, 2023


img

బిఆర్ఎస్‌ పార్టీకి తెలంగాణలో తిరుగులేదు కానీ ఇతర రాష్ట్రాలలో విస్తరించాలంటే అక్కడి ప్రజలతో పాటు ప్రాంతీయ పార్టీల సహకారం చాలా అవసరం. బిఆర్ఎస్‌ పార్టీ ముందుగా మహారాష్ట్రలో నాందేడ్‌లో విజయవంతంగా బహిరంగసభ జరపగలిగింది. ఈ సందర్భంగా కొంతమంది స్థానిక నేతలు పార్టీలో చేరారు కూడా. వచ్చే ఎన్నికలలో మహారాష్ట్రలో అన్ని శాసనసభ స్థానాలకి బిఆర్ఎస్‌ పోటీ చేస్తుందని ఆనాడే కేసీఆర్‌ ప్రకటించారు.

అయితే తెలంగాణలో టిడిపి, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు ఉండరాదని బిఆర్ఎస్‌ నేతలు ఏవిదంగా కోరుకొంటున్నారో అదేవిదంగా ప్రతీ రాష్ట్రంలో కూడా అధికారం కోసం పోరాడుకొంటున్న ప్రాంతీయ పార్టీలు బిఆర్ఎస్‌ ప్రవేశాన్ని సహించడం కష్టం. 

ఇందుకు తాజా నిదర్శనంగా మహారాష్ట్రలోని అధికారం కోసం పోరాడుతున్న నవనిర్మాణసేన కూడా బిఆర్ఎస్‌ రాకని వ్యతిరేకిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇటీవల ప్రెస్‌మీట్‌ పెట్టి, తమ పార్టీ బిఆర్ఎస్‌ రాకని వ్యతిరేకిస్తోందని చెప్పారు. తెలంగాణ సిఎం కేసీఆర్‌ సరిహద్దు జిల్లాల ప్రజలని మభ్యపెట్టి, ప్రలోభపెట్టి బిఆర్ఎస్‌ పార్టీలోచేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని, దీనిని నవనిర్మాణసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. మహారాష్ట్ర ప్రయోజనాలని, మరాఠాల ఐఖ్యతని కాపాడుకోవడం కోసం తాము బిఆర్ఎస్‌ని మహారాష్ట్రలో ప్రవేశించకుండా అడ్డుకొంటామని హెచ్చరించారు.  

ఇక ఏపీలో బిఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించి, ఆ రాష్ట్రంలో కాపులు, యాదవులు, రెడ్డి సామాజిక వర్గాల నేతలని ఆకర్షించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏపీలో కూడా టిడిపి, వైసీపీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. పైగా ఏపీ, తెలంగాణల మద్య విభజన సమస్యలున్నాయి. వివాదాలున్నాయి. ఇవీగాక కేసీఆర్‌ రాష్ట్రాన్ని విభజించి ఏపీకి తీరని అన్యాయం చేశారనే భావన కూడా ఆంధ్రా ప్రజలలో ఉంది. కనుక ఏపీలో బిఆర్ఎస్‌ విస్తరణ మరింత కష్టమే. 

కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జెడిఎస్ అధినేత కుమారస్వామితో దోస్తీ కుదిరింది కనుక ఆ పార్టీ సహాయసహకారాలతో కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పోటీ చేయవచ్చు. కానీ రెండు పార్టీల మద్య సీట్ల పంపకాల అవరోదాన్ని అధిగమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికార బిజెపిని ఢీకొని నిలవాల్సి ఉంటుంది. ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లతో కూడా దోస్తీ కుదిరింది కనుక అక్కడా ఇటువంటి సమస్యలని అధిగమించాల్సి ఉంటుంది.   

తమిళనాడు, కేరళతో సహా దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌, బిజెపి, ప్రాంతీయ పార్టీలని బిఆర్ఎస్‌ ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఒడిశా, గుజరాత్‌, రాజస్థాన్‌, బిహార్‌, యూపీ వంటి రాష్ట్రాలలో బిజెపిని ఎదుర్కోవడం అంత తేలికకాదు. కనుక బిఆర్ఎస్‌ విస్తరణకి ఏదో ఓ ప్రాంతీయ పార్టీతో దోస్తీ తప్పనిసరి. కానీ ఎన్ని ప్రాంతీయపార్టీలు కేసీఆర్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తాయనే దానిపైనే బిఆర్ఎస్‌ విస్తరణ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.


Related Post