తెలంగాణలో వైఎస్ షర్మిలకి ఏం పని?

February 22, 2023


img

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మంగళవారం కరీంనగర్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాట్లాడుతూ, “ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరుకి కూడా నోచుకోలేదు. తెల్లారితే మహిళలు మంచినీళ్ళ కోసం బిందెలతో రోడ్లపైకి రావలసిన దుస్థితి. కానీ తెలంగాణ ఏర్పడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరధ ద్వారా ప్రతీ ఇంటికీ స్వచ్చమైన నీళ్ళు అందిస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుకొని పంటలు పండించుకొంటున్నాము. ఎక్కడికక్కడ హాస్పిటల్స్, వైద్య కళాశాలలు నిర్మించుకొంటున్నాము. రోడ్లు, కాలువలు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకొన్నాము. ఇటువంటి అనేక సంక్షేమ పధకాలు అమలుచేసుకొంటున్నాము. తెలంగాణ రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధిచెందింది. 

ఇవన్నీ చూసి వైఎస్ షర్మిల వంటి వలసపక్షులు మళ్ళీ వచ్చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొనేందుకు వచ్చి పాదయాత్రలు చేస్తూ ప్రజలని మాయమాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అసలు వైఎస్ షర్మిలకి తెలంగాణలో ఏం పని? అన్నతో విభేదిస్తే అతనితో కొట్లాడుకొని అమీతుమీ తేల్చుకోవాలి కానీ తెలంగాణ మీదపడితే ఎలా?

ఎన్నికలు సమీపిస్తున్నందున ఇటువంటి మాయమాటలు చెప్పేవాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు. వారి మాటలు నమ్మి ఓట్లేస్తే మళ్ళీ తెలంగాణ పరిస్థితి మొదటికొస్తుంది. కనుక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొనేందుకు వచ్చి మాయమాటలు చెపుతున్నవారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.  

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ఏర్పడక మునుపు రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడూ పాదయాత్ర చేస్తున్నారు. కనుక ఆమెకి అప్పటికీ, ఇప్పటికీ తెలంగాణలో ఎంత అభివృధ్ది జరిగిందో, ఎంత మార్పు వచ్చిందో తెలిసే ఉంటుంది. కానీ ఆమె పాదయాత్రలో తెలంగాణలో అసలు అభివృద్ధే జరుగలేదని ప్రజలకి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తూ, సిఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. 

సమైక్య పాలకుల నుంచి విముక్తి కోసమే తెలంగాణ ప్రజలు పొరాడి రాష్ట్రాన్ని సాధించుకొంటే, ఆమె తెలంగాణలో మళ్ళీ తన తండ్రి పేరిట రాజన్న రాజ్యం స్థాపిస్తామని చెప్పుకొంటూ పాదయాత్రలు చేస్తుండటం తెలంగాణ ప్రజలని, వారి పోరాటలని అవమానపరచడమే. అసలు ఆమె రాజకీయపార్టీ ఎందుకు పెట్టారు? తెలంగాణలో దేనికోసం తిరుగుతున్నారు? అనే మంత్రి గంగుల కమలాకర్‌ ప్రశ్నకి ఆమె తప్పక సమాధానం చెప్పాలి.


Related Post