కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు పనులకి సంబందించి దక్షిణమధ్య రైల్వే నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికని ప్రకటించింది. ప్రస్తుతం మనోహరాబాద్-గజ్వేల్ మద్య 32కిమీ మేర రైల్వేట్రాక్ పనులు పూర్తవడంతో ట్రయల్ రన్స్ నడుస్తున్నాయి. గజ్వేల్ నుంచి కొడకండ్ల వరకు మరో 12.5 కిమీ ట్రాక్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. కనుక తర్వాత కొడకండ్ల వరకు ట్రయల్ రన్స్ మొదలుపెడతామని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్ట్ నెలాఖరులోగా కొడగండ్ల-దుద్దెడ వరకు, డిసెంబర్‌లోగా దుద్దెడ నుంచి సిద్ధిపేటవరకు, 2024 మార్చిలోగా సిద్ధిపేట నుంచి సిరిసిల్ల వరకు రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. 2025 మార్చి నాటికి సిరిసిల్లా నుంచి కొత్తపల్లి వరకురైల్వే ట్రాక్ నిర్మాణ పనులు పూర్తిచేస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో ముందు నిర్దేశించుకొన్న గడువు ప్రకారమే రైల్వేట్రాక్ పనులు పూర్తిచేస్తూ ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నందున మిగిలిన పనులని కూడా గడువులోగా పూర్తిచేయగలమని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
అసలు కరీంనగర్‌కి రైల్వేలైన్ ఎన్నటికీ రాదనుకొంటే శరవేగంగా పనులు జరుగుతూ అప్పుడే గజ్వేల్ వరకు రైలుబండి వచ్చేసింది. ఇదీగాక ఈ రైల్వే మార్గంలోనే ఉన్న సిఎం కేసీఆర్ ఇటీవల కొండగట్టు ఆలయాభివృద్ధిపై దృష్టి పెట్టి రూ.100 కోట్లు కేటాయించడం, మరోపక్క వేములవాడ మాస్టర్ ప్లాన్ కోసం రూ.50 కోట్లు కేటాయించారు. ఇదే మార్గంలో ఇంకా కొమురవెల్లి, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీనరసింహ స్వామి, నాంపల్లి, వేములవాడ ఆలయాలున్నాయి. నూకపల్లి నుంచి మాల్యాల స్టేషన్ని కూడా కలిపితే కొండగట్టు ఆంజన్న ఆలయానికి రైలు మార్గం ఏర్పడుతుంది. అప్పుడు ఈ రైల్వేమార్గం తీర్దయాత్రల స్పెషల్ కారిడార్‌గా మారిపోతుంది. కనుక ఈ రైల్వే ప్రాజెక్టు వలన అటు రైల్వేకి, ఇటు భక్తులకి కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తపల్లి ప్రధాన రైల్వే జంక్షన్‌గా మారుతుంది. అప్పుడు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్ధిపేట, సిరిసిల్లా జిల్లాల ప్రజలు కొత్తపల్లి నుంచే నేరుగా ముంబై, షిరిడీ, బెంగళూరుకి రాకపోకలు సాగించవచ్చు.