ఇటీవల శాసనసభ బడ్జెట్ సమావేశాలలో మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మద్య జరిగిన వాగ్వాదం, వచ్చే ఎన్నికలలో 50 స్థానాలలో పోటీ చేస్తామనే మజ్లీస్ ప్రకటన చూసి, బిఆర్ఎస్, మజ్లీస్ మద్య చెడిందని అందరూ అనుకొన్నారు. కానీ అదంతా తమ రాజకీయ ప్రత్యర్దులని ఏమార్చడానికే అనే విషయం మెల్లగా బయటపడింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో బిఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు ఏపాటిలాగే పరస్పరం సహకరించుకోవడానికి సిద్దపడ్డాయి.
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో మజ్లీస్ అభ్యర్ధి సయ్యద్ హాసన్ జాఫ్రీకి మద్దతు ఇవ్వాలని అసదుద్దీన్ ఓవైసీ కోరగా అందుకు సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. గత ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ ఆయనకి మద్దతు ఇచ్చి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు తోడ్పడింది. కనుక ఈసారి కూడా ఆయనకి సహకరిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 127 ఓట్లలో ప్రస్తుతం 118 మంది మాత్రమే ఉన్నారు. వారిలో 83 మంది జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాగా మిగిలిన 35 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. ఆ ప్రకారం బిఆర్ఎస్, మజ్లీస్ పార్టీలకి కలిపి 83 ఓట్ల బలం ఉండగా, బిజెపికి 33 ఓట్ల బలం ఉంది. కనుక మజ్లీస్ అభ్యర్ధి ఎన్నిక కేవలం లాంఛనప్రాయమే.