మునుగోడు ఉపఎన్నికలలో సిఎం కేసీఆర్ వామపక్ష నేతలతో మాట్లాడి ఒప్పించి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు కూడగట్టగలిగారు. రాష్ట్ర వామపక్ష నేతలు కేసీఆర్ సభలో పాల్గొన్నారు. బిఆర్ఎస్‌తో తమ పొత్తులు మునుగోడుకే పరిమితం కాకపోవచ్చని మున్ముందు ఎన్నికలలో కలిసి పనిచేసే ఉద్దేశ్యం ఉన్నట్లు మాట్లాడారు. ఆ ఉపఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్ధి గెలిచిన తర్వాత తమ మద్దతు వలననే అతను గెలవగలిగాడని వామపక్ష నేతలు చెప్పుకోగా బిఆర్ఎస్ నేతలెవరూ ఖండించలేదు. కనుక జాతీయ రాజకీయాలలో కూడా కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీతో వామపక్షాలు పనిచేస్తాయనే భావనలో ప్రజలున్నారు. అయితే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇందుకు భిన్నంగా స్పందించడం విశేషం.
హైదరాబాద్‌లో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మాకు బిఆర్ఎస్ టికెట్లు ఇచ్చేదేమిటి?తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది మేమే. కనుక మా అవసరం ఉందనుకొంటే బిఆర్ఎస్ పార్టీయే మా దగ్గరకి వస్తుంది. లేకుంటే ఎవరి దారి వారిదే. బిఆర్ఎస్‌తో పొత్తుల గురించి మేమేమీ తొందరపడటం లేదు. సీపీఐ, సీపీఎం పార్టీలు మాత్రం ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి. మునుగోడులో మేము బిఆర్ఎస్‌కి గుడ్డిగా మద్దతు ఇవ్వలేదు. మా ఒత్తిడి వల్లనే బిఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల సమస్యని పరిష్కరించేందుకు సిద్దం అవుతోంది. కనుక బిఆర్ఎస్‌తో పొత్తులున్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో మా పోరాటాలు ఆగవు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోందని మంత్రులు గొప్పలు చెప్పుకొంతున్నారు. కానీ అది నిజం కాదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు ప్రాంతాలలో రైతులు తమ పొలాలకి నీళ్ళు పెట్టలేకపోతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. కనుక సిఎం కేసీఆర్ తక్షణం ఈ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము,” అని కూనంనేని సాంబశివరావు అన్నారు.