హాత్ సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రూ.5లక్షలకి ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, రూ.500లకే గ్యాస్ బండ, రెండు లక్షల మందికి ఉద్యోగాలు అంటూ కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా ఎన్నికల హామీలని ప్రకటించేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడే తమ ఎన్నికల మ్యానిఫెస్టోని తయారుచేసుకొందా? ఒకవేళ మ్యానిఫెస్టో సిద్దం కాకపోతే రేవంత్ రెడ్డి ఏవిదంగా ఈ హామీలు ప్రకటిస్తున్నారు?అసలు వాటి గురించి పార్టీలో చర్చించారా లేదా? లేదా రేవంత్ రెడ్డి సొంతంగా హామీలు ప్రకటించేస్తున్నారా? రేపు మిగిలిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇలాగే ఎవరికి తోచిన హామీలు వారు ప్రకటించుకొంటూ పోతే పరిస్థితి ఏమిటి?అనే సందేహం కలుగుతుంది.
హామీల తర్వాత మరో ముఖ్యమైన విషయం... కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు?రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ప్రజలతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదట ధరణి పోర్టల్ రద్దు చేస్తూ జీవో జారీ చేస్తామని చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ ఫైలుపై తొలి సంతకం చేస్తానని చెపుతున్నారనుకోవలసి ఉంటుంది. అందుకు పార్టీలో నేతలందరూ సమ్మతిస్తారా?అంటే అనుమానమే. రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపడితేనే తీవ్రంగా వ్యతిరేకించిన సీనియర్ నేతలు ఆయనని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరిస్తారనుకోలేము. మరైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి పోర్టల్‌ని రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ఏ హోదాతో చెప్పారు?అనే ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీయే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే ప్రశ్నకి పార్టీలో ఎవరూ సమాధానం చెప్పలేరు. చెపితే అది కాంగ్రెస్ పార్టీలో మరో తేనెతుట్టెని కదిలించడమే అవుతుందని అందరికీ తెలుసు. కనుక రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి వెళ్ళవచ్చు.
అయితే త్వరలో కాంగ్రెస్ నాయకులందరూ పాదయాత్రలు ప్రారంభించబోతున్నారు. కనుక ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయం తర్వాత తేల్చుకోవచ్చు కానీ ముందుగా ఎన్నికల హామీలపై పార్టీలో చర్చించుకొని బయలుదేరడం మంచిది. లేకుంటే పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ఇప్పుడే నిండిపోతుంది.