తెలంగాణ ప్రజల ఆకాంక్షలని నిజం చేసి చూపించిన సిఎం కేసీఆర్ పుట్టినరోజు నేడు. సమైక్య పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకి గురవుతోందనే సంగతి అందరికీ తెలుసు కానీ సరైన నాయకత్వం లేకపోవడం, ఒకవేళ ఉన్నా వారిలో పోరాటపఠిమ లేకపోవడం వలన అనేక దశబ్ధాలపాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కలగానే మిగిలిపోయింది.
తెలంగాణ సమస్యలు, అవసరాల పట్ల పూర్తి అవగాహన, మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన కేసీఆర్ తెలంగాణ సాధనే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీని స్థాపించడంతో మొదలైన ఉద్యమాలు సుమారు 14 ఏళ్ళపాటు ఏకధాటిగా సాగాయి. దేశంలో మరే రాష్ట్రంలో ఇన్నేళ్ళపాటు ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు.
ఓపక్క రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తున్న శక్తులతో నిరంతర పోరాటాలు చేస్తూనే, మరోపక్క ఏళ్ళతరబడి ప్రజలందరినీ కలిపి ఉంచడం మామూలు విషయం కాదు. కానీ అపూర్వమైన నాయకత్వ లక్షణాలు కలిగిన కేసీఆర్ ప్రజలని, ప్రతిపక్షాలనీ కూడా కలుపుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
అంతటితో వదిలేసి ఉంటే కేసీఆర్ చరిత్రలో కనుమరుగైపోయేవారు. కానీ ఆ తర్వాత బంగారి తెలంగాణ సాధన కోసం చాలా దూరదృష్టితో, చక్కటి ప్రణాళికలని రచిస్తూ కేవలం 5-6 ఏళ్ళలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపారు. అంతేకాదు... తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ భాష, యాస, సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు, పబ్బలు అన్నిటికీ గుర్తింపు, సముచిత గౌరవం లభించేలా చేశారు. అదే ఆయనని మిగిలిన నాయకులకి భిన్నంగా, ఉన్నతస్థానంలో నిలిచేలా చేసిందని చెప్పవచ్చు.
ఇప్పుడు అదే సంకల్పం, అదే పోరాట స్పూర్తితో భారత్‌ని చక్కదిద్దేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో సర్వశక్తివంతమైన మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రధాని పదవి చేపట్టేందుకు కేసీఆర్ బలమైన అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిన కేసీఆర్ అత్యున్నతమైన ప్రధాని పదవి చేపట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయన ఆశయాలు నెరవేరాలని కోరుకొంటూ యావత్ తెలంగాణ ప్రజల తరపున మైతెలంగాణ.కామ్ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.