రేవంత్‌ రెడ్డి సవాల్ కేసీఆర్‌ స్వీకరించగలరా?

February 17, 2023


img

హాత్ సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, గురువారం సాయంత్రం వరంగల్‌ జిల్లా, వర్ధన్నపేటలో అంబేడ్కర్ సెంటర్ వద్ద ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తూ జీవో జారీ చేస్తాము. ధరణితో భూముల క్రయవిక్రయాలు అస్తవ్యస్తంగా మారాయి. కనుక ముందుగా ఈ ధరణి దరిద్రాన్ని వదిలిస్తాము. వరంగల్‌, వర్ధన్నపేట చుట్టుపక్కల ల్యాండ్ పూలింగ్ పేరుతో బిఆర్ఎస్‌ ప్రభుత్వం గుంజుకొన్న మీ భూములన్నీ వెనక్కి ఇప్పిస్తాము. దీని కోసం బిఆర్ఎస్‌ ప్రభుత్వం మీ చేతిలో ఐదువేలో పదివేలో పెడుతుండవచ్చు. కానీ వాటితో వారసత్వంగా మీకు వచ్చిన భూములు మీ చేతిలో ఉండవు. కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ భూములు మీకు ఇప్పించి ఈ భూసమస్యలన్నీ తప్పక పరిష్కరిస్తాము,” అని హామీ ఇచ్చారు.           

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి విసిరిన సవాలు చాలా ఆసక్తికరంగా ఉంది. “మీరు డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళు ఇచ్చిన చోట మీరు ఓట్లు వేయించుకోండి. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన చోట మేము ఓట్లు వేయించుకొంటాము. లక్ష ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన్న చోట మీ ఎమ్మెల్యేని గెలిపించుకోండి. రానిచోట మేము గెలిపించుకొంటాము. దళితులకి మూడెకరాలు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడిగి తీసుకోండి. ఇవ్వనిచోట మేము తీసుకొంటాము. దళిత బంధు తీసుకున్నవారందరూ బిఆర్ఎస్‌కి ఓట్లు వేసుకోండి. పొందని వారందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి. అలాగే లక్ష రూపాయల రుణమాఫీ అయిన వాళ్ళందరి చేత బిఆర్ఎస్‌కి ఓట్లేయించుకోండి. ఇవ్వనివారి చేత మేము వేయించుకొంటాము,” అంటూ సవాల్ విసిరారు. 

రేవంత్‌ రెడ్డి సూచించిన ప్రకారం ప్రజలు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని వేరే చెప్పక్కరలేదు. ఎందుకంటే డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళు, రుణమాఫీ, దళితులకి మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటి హామీలని బిఆర్ఎస్‌ ప్రభుత్వం అమలుచేయలేక చేతులెత్తేసింది. నెలకి రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వడానికి వెనకాడుతున్న సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో దళితులందరికీ పది లక్షల చొప్పున దళితబంధు ఇస్తామని చెప్పుకొంటున్నారు. కొంతమందికి దళితబంధు ఇచ్చి ఉండవచ్చు కానీ అందరికీ ఇవ్వడం అసాధ్యమని అందరికీ తెలుసు.

నిరుద్యోగ భృతి, దళితబంధు హామీలనే అమలుచేయలేకపోతున్న సిఎం కేసీఆర్‌ ఇప్పుడు గిరిజనబంధు ఇస్తామని మరో కొత్త హామీ ఇస్తున్నారు. హామీలు ఇవ్వకపోయినా ప్రజలు ఏమీ అనుకోరు కానీ హామీలు ఇచ్చి అమలుచేయకపోతే మోసం చేశారని భావిస్తారు. అందుకే రేవంత్‌ రెడ్డి ప్రజల తరపున సిఎం కేసీఆర్‌ని ఈవిదంగా నిలదీస్తున్నారని భావించవచ్చు.  


Related Post